– రద్దు… ఆ వెంటనే ఉపసంహరణ
– దానికి బదులుగా 10 ఫార్మా క్లస్టర్ల ప్రతిపాదన
– ఇంకా మొదలుకాని ఏర్పాటు ప్రక్రియ
– అప్రమత్తం కాకుంటే ఫార్మా కంపెనీలు తరలిపోయే ప్రమాదం
– అయోమయంలో టీఎస్‌ఐఐసీ అధికారులు
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీ భవితవ్యం ముందు నుయ్యి… వెనుక గొయ్యిలా తయారైంది. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి… ఆ వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దాని స్థానంలో వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఎలాంటి కార్యచరణ ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఫార్మా సిటీ ఉన్నట్టా? లేనట్టా? అనే అంశం అటు అధికారులకు గాని, ఇటు ఫార్మా రంగ నిపుణులకు గాని తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు సర్కార్ తెరదించకుంటే ఫార్మా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి పోయే అవకాశ ముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీ భవితవ్యం ముందు నుయ్యి… వెనుక గొయ్యిలా తయారైంది. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి… ఆ వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దాని స్థానంలో వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఎలాంటి కార్యచరణ ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఫార్మా సిటీ ఉన్నట్టా? లేనట్టా? అనే అంశం అటు అధికారులకు గాని, ఇటు ఫార్మా రంగ నిపుణులకు గాని తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు సర్కార్ తెరదించకుంటే ఫార్మా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నగర శివార్లను ఆనుకుని రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులోని యాచారం, కడ్తాల్, కందుకూర్, మండలాల్లోని పది గ్రామాల పరిధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ కోసం 2014లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు దశల్లో నిర్మించే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం 18,333 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 13 వేల ఎకరాల భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) సేకరించింది. మిగతా భూ సేకరణలో స్థానికుల సహాయ నిరాకరణ, కోర్టు కేసుల నేపథ్యంలో ముందుకు సాగలేదు. 20 ఏండ్ల వ్యవధిలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, దాదాపు 5లక్షల 50వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మా సిటీ పరిధిలో తమ కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు 400 ఫార్మా కంపెనీలు ఇప్పటి వరకు దరఖాస్తులు పెట్టుకున్నాయి. తొలి దశలో 200 కంపెనీలకు స్థలం కేటాయించారు. అందులో కొన్ని కంపెనీలు నిర్మాణం కూడా మొదలు పెట్టాయి. అయితే ఇప్పటివరకు ఏ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈ లోపు 2023 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని ప్రకటించి, అ వెంటనే ఉపసంహరించుకుంది. ఇందుకు బదులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10 ఫార్మా విలేజిలను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఫార్మా సిటీ స్థాయిలోనే ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పినా, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కార్యచరణ రూపుదాల్చ లేదు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అటు టౌన్‌షిప్ ముందుకు సాగడంలేదు…. ఇటు ఫార్మా సిటీపై క్లారిటీ లేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుకు కదలని క్లస్టర్ల ఏర్పాటు
ఫార్మా సిటీని రద్దు చేసి దానికి బదులు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో పది ఫార్మా విలేజీల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించి భూ కేటాయింపులు ఇప్పటి వరకు జరగలేదు. ఫార్మా రంగ అభివద్ధికి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఫార్మా క్లస్టర్లను వెంటనే చేపట్టి వాటిని అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఫార్మా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే అత్యధిక వాటా ఉన్న తెలంగాణలో ప్రపంచ దిగ్గజ పార్మా కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన శ్రద్ధ, ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు ఇతర రాష్ట్రాల వైపు దష్టి సారించే పరిస్థితి ఉత్పన్నమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఇందుకు సంబంధించి అనేక ఉదహారణలున్నాయి. ఒప్పందం అయిన కంపెనీలు సైతం తమ పెట్టుబడులను తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు తరలించాయి. ప్రభుత్వం ఫార్మా సిటీ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుంటే గతం పునరావృతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.