ఇక ఓఆర్‌ఆర్‌ వెలుపల ఫార్మా క్లస్టర్లు

– ఔషధ ఎగుమతులకు హైదరాబాద్‌ కేంద్రం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్‌: ఫార్మా రంగానికి సంబంధించిన క్లస్టర్లను ఇకపై ఒఆర్‌ఆర్‌ వెలుపల ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఫార్మాస్యుటికల్‌ కాన్ఫరెన్స్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఔషధాల ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. రోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నుముక లాంటిదన్నారు. రోగుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మ రంగానిది కీలకపాత్ర అన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్‌ మెడిసిన్‌ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఒఆర్‌ఆర్‌ నిర్మించడంతో హైదరాబాద్‌కు ఎన్నో ఐటి పరిశ్రమలు వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.