కేంద్రం హామీల అమలుకు దశలవారీ ఆందోళనలు

–  సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు కోసం దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు టి సాగర్‌, మురళిరెడ్డి, వేములపల్లి వెంకట్రామ య్య, రాయల చంద్రశేఖర్‌, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, పల్స యాదగిరి మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తేయడంతో పాటు పంటల బీమా పథకాన్ని సవరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీలిచ్చిందని గుర్తు చేశారు. కానీ వాటిని పక్కన పెట్టి కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని విమర్శించారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నదని అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు రాయితీలిస్తున్న కేంద్రం రైతుల రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. మరోవైపు ప్రజా పోరాటాలపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం నాయకులు గుమ్మడి నర్సయ్య, వి ప్రభాకర్‌, కె గోవర్ధన్‌,వి కోటేశ్వరరావు, మండల వెంకన్న, బాబన్న పాల్గొన్నారు.