– పోలింగ్‌పై నేతల ఫీడ్‌బ్యాక్ స్వీకరణ
– పోలింగ్ ఏజెంట్ల నుంచి డేటా సేకరణ
– డివిజన్లు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు
– స్ట్రాంగ్ రూమ్స్‌లో అభ్యర్థుల భవితవ్యం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక.. ప్రధాన పార్టీల నేతలు మరో పనిలో పడ్డారు. ఓటర్లకు ఫోన్‌కాల్స్ చేస్తూ ఫీడ్ బ్యాక్ సేకరించుకుంటున్నారు. ‘ఓటు ఎవరికి వేశారు..? కాంగ్రెస్‌కు వేస్తే ఒకటి నొక్కండి..? బీజేపీకి వేస్తే రెండు నొక్కండి..? బీఆర్ఎస్కు వేస్తే మూడు నొక్కండి..? నోటాకు వేస్తే నాలుగు నొక్కండి..? ఇతరులకు వేస్తే ఐదు నొక్కండి..?’ అంటూ ప్రధాన పార్టీలు ఓటర్లకు ఫోన్‌కాల్స్ చేసి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నాయి. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు ఫోన్లు చేసి ఓటు ఎవరికి వేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. పోలింగ్ ఏజెంట్లు, బూత్‌లు, డివిజన్లు, మండలాలు, నియోజకవర్గాల వారీగా డేటాను సేకరిస్తున్నారు. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోటములపై ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రంగా ఉంచిన ఈవీఎంలలో దాగి ఉంది. ఫలితాలకు మరో 20 రోజుల సమయం ఉంది. దీంతో ఆయా పార్టీలు, అభ్యర్థులు, కింది స్థాయి నాయకులు పోలింగ్ ముగిసిన రాత్రి నుంచే లెక్కలేయడం మొదలు పెట్టారు. గతేడాదితో పోల్చుతూ పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. వర్గాలు, కులం, మతం, ప్రాంతం, ఆయా రంగాల వారీగా ఓటర్ల నాడీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులతో అభ్యర్థులు, అధిష్టానం పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.
ఓటర్లకు ఫోన్ కాల్స్ బెడద
ఎన్నికల ముందు.. ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గత అనుభవాలు, మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు, ఎన్నికల ప్రచార శైలి, అగ్ర నాయకుల ఆగమనం, పోటీ చేసే అభ్యర్థి గుణగణాలు, మంచి చెడు లాంటి విషయాలను వివరించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ తర్వాత కాస్త భిన్నంగా ఫోన్ కాల్స్ చేసి ‘ఓటు ఎవరికి వేశారు..? పలానా పార్టీకి వేస్తే ఒకటి నొక్కండి.. రెండు నొక్కండి.. ‘ అని ఆప్షన్లు ఇస్తూ, ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఫోన్ కాల్స్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా తమ పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీల గెలుపోటములను సైతం అంచనా వేసే అవకాశం లేకపోలేదు. ఈ సమాచారం ఆధారంగా ఫలితాలు రాకముందే గెలుపు ఎవరిదో సులువుగా తెలుసుకునే అవకాశం ఉన్నట్టు ఆయా పార్టీలు, అభ్యర్థులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏజెంట్లు, బూత్‌ల సమాచారమే ముఖ్యం..
ఫోన్‌కాల్స్‌కు తోడు పోలింగ్ ఏజెంట్లు, బూత్‌ల నుంచి స్పష్టమైన సమాచారం కోరుతున్నారు. పోలింగ్ సరళికి అతి దగ్గర ఉండే ఏజెంట్లు, ఓటర్ల మనోగతం గురించి అవగాహన ఉన్న బూత్ ఇన్చార్జీల నుంచి నేతలు పక్కా సమాచారం తెప్పించుకునే పనిలో పడ్డారు. దీనికితోడు వీరికి ఓటర్లపై ఓ అంచనా ఉండటంతో వారు ఎవరికి ఓటేసి ఉంటారో..? అని ఉహించే పనిలో పడ్డారు.
ఎవరి ధీమా వారిది..
గెలుపోటములపై ఎవరి ధీమా వారికే ఉంది. బూత్‌లు, డివిజన్లు, మండలాలు, నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ జరిగింది అనే వివరాల ఆధారంగా గెలుపోటములపై నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఎంత శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఏ మండలంలో ఎంత మేరకు ఓట్లు రానున్నాయి.. ఏ మేరకు మెజార్టీ వస్తుందో అని లెక్కలేసు కుంటున్నారు. డివిజన్లు, మండలాల వారీగా పార్టీ శ్రేణుల నుంచి వివరాలు రాబట్టి అంచనాకు వస్తున్నారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఇస్తున్న సమాచారంతో అభ్యర్థులు లెక్కల్లో మునిగి పోయారు. గత ఎన్నికల గణాంకాలతో పోల్చి చూసుకుంటున్నారు. కాస్త తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్నది. లోలోపల ఎవరికి వారే ఓటింగ్ తమకే అనుకూలమని ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.