
– మనోళ్లను జర గుర్తుoచుకొండి
– వలస ఓటర్లకు అభ్యర్థుల వల
నవతెలంగాణ- మల్హర్ రావు: అన్నా మంచిగున్నవానే. ఈ ముప్పై తారీఖు ఉట్లో ఓట్లు ఉన్నాయ్.. గుర్తుతుంది కదా.. జరంతా తప్పకుండా అందరూ రావాలే. వదినను కూడా తీసుకరండ్రి అందరూ మనపార్టీకే ఓటు వేయాలే. మనోళ్ళను గెలిపించుకోవాలే. ఎంత పని ఉన్న కొంచెం పక్కన పెట్టుకొని ముందే రావాలే రానుపోను ఖర్చులు మేమే బరిస్తాం. అవసమైతే ముందుగాలే పేమెంట్ కొడుతాం. ఇంతకు నిది ఫోన్ పెనా.. గూగుల్ పెనా.. అన్నా అంటూ మంథని నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లను సంప్రదిస్తున్నారు. హైదరాబాద్, ముంబాయ్ తోపాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని సంప్రదిస్తూ ఓట్లకు గాలం వేస్తున్నారు.
ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ….
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్కొక్క సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు, ఒడిన ఉందండులున్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి ఓటర్ను అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్రలేవగానే అందరి టచ్ లోకి వెళుతున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దీ రోజులుగా కష్టపడుతున్నారు. వలస ఓటర్లు కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు,స్నేహబంధాలు, బంధుత్వాలు ఇలా ప్రతి ఒక్కరినీ పలకరించి తమ అభ్యర్థికె ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఎదో ఒక సమయంలో నేరుగా కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్లో సంప్రదిస్తున్నారు.
అన్న, అక్కా అంటూ..
గ్రామాల్లో ఉన్నవారి నుంచి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అన్నా.. అక్కా అంటూ సoబోదిస్తూ ఓటేసేందుకు తప్పకుండా ఓటేసేందుకు రావాలని కోరుతున్నారు. ఎన్ని పనులున్నా ఒక్కరోజు టైం ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైతే దారి ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు. నమ్మకం లేకుంటే ముందస్తుగానే పంపిస్తామని మీది ఫోన్ పెనా..గూగుల్ పెనా.. అని అడుగుతూ ఆన్ లైన్ పేమెంట్ చేసేస్తున్నట్లుగా సమాచారం. తమ అభ్యర్థికె ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇలా వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న మంథని నియోజకవర్గంలో వివిధ పార్టీల కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓటు బ్యాంకు పెంచే పనిలో నిమగ్మమవడం కనిపిస్తోంది.