– నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
స్వాతంత్ర్య పోరాటాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరం అని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతు కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ)ని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతూ కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐ ఎ ఎస్, జిల్లా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరం. ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రేరణ పొంది, దేశ సేవకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని నేను యువతను కోరుతున్నాను అన్నారు.
ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ, మన పూర్వీకులు ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను ఇది తరువాతి తరానికి నేర్పుతుంది అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేటి యువతకు నాటి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, సాగించిన పోరాటాలు తెలుస్తాయని అన్నారు. స్వాత్రంత్య్ర పోరాటం పాల్గొన్న మహనీయులను, స్మరించుకోవడానికి, యోధుల త్యాగాలను యువతకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ.. స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ..విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తెలుగు స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు తెలిపే సుమారు 30కి పైగా చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర స్వాతంత్ర సమరయోధల పాత్రలను తెలిపే విషయాలను, చిత్రాలను ఈ ఎక్సిబిషన్ లో ప్రదర్శించారు. అనంతరం బహుమతులు ప్రధానం లో ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధులు ఫోటో ఎగ్జిబిషన్ పై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్ మోహన్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్.కె.రసూల్ బీ, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ రవీంద్రారెడ్డి, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, అధ్యాపకులు, ఎన్ సీసీ క్యాడేట్స్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.