కాల గర్భంలో కనుమరుగవుతున్న చిత్రాలకు సజీవ సాక్షాన్ని అందించేది ఫోటోగ్రఫీ మాత్రమే అని ఫోటో, వీడియోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు పొగులకొండ అశోక్ అన్నారు. సోమవారం 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితమహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ ఒక్క క్లిక్ తో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన శక్తి ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది అన్నారు. ప్రతీ క్షణాన్ని మన కళ్లెదుట చెదరని జ్ఞాపకంగా నిలిపి ఉంచేది ఫొటో మాత్రమే అని వ్యాఖ్యానించారు. మాటల్లో చెప్పలేని వంద భావాలు ఒక్క ఫొటోతో పలికించగలమనేది అక్షరసత్యం అన్నారు. టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్లు రావడంతో ఫోటోగ్రఫీ వ్యవస్థ కొంత మసకబారిది అనేది వాస్తవం అన్నారు. ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లకు చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్, ఆకారుపు విష్ణు, మొరపోజు రాజశేఖర్,గాజుల రాజు, పాము భరత్, గోరంట్ల ప్రభాకర్, గజవెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.