దేశంలోని పౌరులందరూ సేవానిరతిని కలిగియుండాలని తన ‘ప్రతిజ్ఞ’ ద్వారా పైడిమర్రి గుర్తుచేయడం ఒక సామాజిక దృక్కోణంగా భావించవచ్చు. ఇంతటి మహోన్నతమైన తెలుగుపలుకులు దేశభాషలన్నింటిలోనూ అనువాదం కాబడి లక్షల పాఠశాలల్లో ఉదయాన్నే పిల్లలందరూ ఆలపించడం తెలుగు తేజానికి ప్రతీక. అలాంటి మహోన్నత మాటలను మనకందించిన పైడిమర్రి భారతదేశ సాహితీ జగత్తులో మకుటాయమానంగా వెలిగిపోతారని చెప్పడంలో ఏ మాత్రం సంశయం లేదు. పైడిమర్రి మన తెలుగువారు కావడం మన తెలుగుజాతికే గర్వకారణం.
పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్లగొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో 1916 జూన్ 10న వెంకట్రామయ్య, రాంబాయమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం అన్నేపర్తి, నల్గొండలో సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. పైడిమర్రి వారి భార్యపేరు వెంకటరత్నమ్మ. చిన్న చిన్న పాటలతో మొదలైన ఆయన సాహితీప్రస్థానం మొదట్లో కొన్ని ఆధ్యాత్మిక రచనలు చేసి, తర్వాత ‘మనిషికి ఎంత భూమి కావాలి’ లాంటి విప్లవాత్మక రచనలు వైపు మరలింది. జమీందారు, భూస్వామి విధానాలను నిరసిస్తూ ఆనాటి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక కథలు రాశారు. తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ అనే చిన్న నవల రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు. బ్రహ్మచర్యం, గృహస్థజీవితం, స్త్రీధర్మం, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు కూడా రాశారు.
గోల్కొండ, సుజాత, ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్, ఆనందవాణి మొదలగు వివిధ పత్రికలో వీరి రచనలు ప్రచురింపబడ్డాయి. తెలంగాణ తొలితరం కథలలో ఒకటిగా ‘నౌకరి’ కథ వచ్చింది. 1945లోనే ‘ఉషస్సు’ కథల సంపుటిని వెలువరించారు. నేడు ‘నౌకరి’, ‘పిల్లపోదు’ అనే కథలు మాత్రమే లభ్యమవుతున్నాయి. పైడిమర్రి రచనలు భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన గ్రంథాలయాన్ని తన కుమారులు ‘గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలకు’ అప్పగించారు. ప్రస్తుతం అది మూతబడింది. పైడిమర్రి హైదరాబాదు రాష్ట్రంలోని ట్రెజరీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఖమ్మం, విశాఖపట్నం, హైదరాబాద్ జిల్లాలో పనిచేశారు. 1962లో విశాఖలో ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు ఈ ‘ప్రతిజ్ఞ’ పలుకులు తయారు చేశారు. అప్పటికే పైడిమర్రి పలుభాషలలో నిష్ణాతులు. మన దేశ విద్యార్థుల్లో ప్రాథమికస్థాయి నుండే దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే తన అనుభవంతో ప్రతిజ్ఞకు పదాలు రాసి ఒక రూపం తీసుకొచ్చారు.
విశాఖ సాహితీమిత్రుడు తెన్నేటివిశ్వనాథంతో ఈ విషయంపై చర్చించి ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం’ అనే వాక్యాన్ని అదనంగా జతచేసారు. అయితే ఈ ‘ప్రతిజ్ఞ’ను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లడం ఎలా! అని ఆలోచించేటప్పుడు, అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా ఉన్న పి.వి.జి.రాజు దృష్టికి తెన్నేటి వారి సాయంతో తీసుకెళ్లారు. ఈయన కూడా సాహితీవేత్త కావడంతో ప్రస్తుత సమయంలో దేశానికి ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని అర్థం చేసుకున్నారు. 1964లో బెంగుళూరులో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయవిద్యాలయ సలహామండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పైడిమర్రి ప్రతిజ్ఞను ‘జాతీయ ప్రతిజ్ఞగా’ ప్రభుత్వం స్వీకరించింది. తర్వాత అన్ని భాషలలోకి అనువదించి 1965 జనవరి 26 నుండి దేశమంతటా పిల్లలు పాఠశాలల్లో చదివేటట్లు ఏర్పాటుచేశారు. అయితే పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ కాలానుగుణంగా కొన్ని స్వల్పమార్పులకు గురైంది. గ్రాంథికభాషలో ఉన్న కొన్ని పదాలకు బదులు వాడుకభాషా పదాలను చేర్చారు. భారతదేశానికి ‘జాతీయ ప్రతిజ్ఞ’ అందించిన మహనీయుని మూలాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే దృఢసంకల్పంతో ఎలికట్టె తెలంగాణ సాహితీమిత్రులతో కలసి పైడిమర్రి కుమారుడు పీవీ సుబ్రహ్మణ్యం, అల్లుడు వెంకటేశ్వరశర్మ సహకారంతో ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ పేరుతో ఓ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
అంతవరకు మన తెలుగు పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రించబడి ఉండేది. కానీ రచయిత పేరు మాత్రం ఉండేది కాదు. తర్వాత కాలంలో జనవిజ్ఞానవేదిక, ఇతరవేదికలు, పలువురు అభ్యుదయవాదుల కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ముద్రించబడిన పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ పక్కన పైడిమర్రి పేరు చేర్చారు. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదం చేస్తుంది. ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తుంది. అలాంటి ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి జీవిత చరిత్ర ‘భారతదేశం నా మాతృభూమి’ పేరుతో, ఆంగ్లంలో ‘ది ఫర్గాటెన్ పేట్రియాట్’ అనే పేరుతో, హిందీలో ‘భారత్ మేరా మాతృభూమి హై’ పేరిట ప్రముఖ ప్రచురణ సంస్థ వి.జి.ఎస్ ముద్రణ చేసింది. 2016లో తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతిలో పైడిమర్రి సంస్మరణసభ పెట్టింది.
భారతీయులంతా ఒక్కటేనన్న భావం చాటిచెప్పే ప్రతిజ్ఞకు ప్రాముఖ్యం కల్పించాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలపై తప్పక ఉంది. ప్రస్తుతం కేవలం తెలుగురాష్ట్రాలలో ప్రచురించిన పాఠ్యపుస్తకాల్లో మాత్రమే పైడిమర్రి పేరు కనిపిస్తున్నది. అది కూడా గడిచిన పదేండ్ల నుండి మాత్రమే. అయితే అన్ని భాషల్లో ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో ఆయన పేరు ముద్రించేటట్లు చేయడానికి మనందరం కంకణం కట్టుకోవాలి. అలా చేసిననాడే పైడిమర్రి వారికి ఘననివాళి అర్పించినట్లు అవుతుంది. ఆ దిశగా మేధావులు, ప్రజాతంత్ర వాదులు, కవులు, రచయితలు నేటి పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.
(జూన్ 10 పైడిమర్రి జయంతి)
– యం. రాం ప్రదీప్, 9492712836