నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు బాధ్యులు ఎవరో తేల్చేందుకు ఆ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలంటూ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ)లతో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. పిల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, డ్యాం సేఫ్టీ అధారిటీ, జాతీయ విపత్తుల నిర్వహణ మండలి, ఎస్‌ఎఫ్‌ఐఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మహదేవ్‌పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఈ ఏడాది నవంబరు 1న ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యలైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. మేడిగడ్డతోపాటు ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు తీసుకునేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్‌కి ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.