‘మెట్రో’ శబ్ద కాలుష్యం తగ్గించాలని పిల్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెట్రో రైలు మార్గాల్లో మలుపుల వద్ద శబ్ద కాలుష్యం విపరీతంగా ఉందంటూ అందిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుంది. దీన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌)ను ఆదేశించింది. ఆరు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు నోటీసులు జారీ చేసింది. శబ్ధకాలుష్య సమస్యపై డాక్టర్‌ హనుమా: అనే వ్యక్తి రాసిన లేఖను పిల్‌గా తీసుకున్న చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.సికింద్రాబాద్‌ బోయిగూడ మెట్రో పిల్లర్‌ నంబర్‌ బీ1006 మలుపు వద్ద రైలు ప్రయాణించే సమయంలో పెద్ద ఎత్తున శబ్దం వస్తోందనీ, దీని వల్ల వినికిడి సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు, అడ్రినలిన్‌, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని పిటిషనర్‌ వివరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు విచారణను వాయిదా వేసింది.