పైలం… పైలం…

Pilam... Pilam...ముసుర్లకు చిగురంతోలె
జెపజెప్పన సువ్వన పెరిగినవు
పండు వెన్నెల పిండారవోసినట్టే
పన్నెండేండ్లుగా పసిరిక అక్కరాల తొవ్వల పయనించినవు
చదువుల పూదోట ఒడిన
కంగారును దరిచేరనివ్వని కంగారు తల్లోలెనే సాకినం
ఇన్నొద్దులయితే పెయ్యిమీద ఈగను వాలనీయకుంట
కంటికి రెప్పోలెనే నిగురానుగ కాపాడినం

పసిగుడ్లు కండ్లు తెరువంగనే
ఈనిన ఇంట్లకెళ్ళి ఈడ్సుకపొయ్యే కోతిరీతి కాదు
పిల్లతల్లి పాయిరంగ కూనలను నోట కర్సుకొన్నట్టు
ఏడిండ్ల దొందులను పైలంగా ఎల్ల తిప్పినట్టు
ఇగురం ఇరువాటులను ఎరుకపరచిన వైనం
లోకం పోకడలను వొంటవట్టించిన సుకోశి పొదన
నిన్ను నిజానం బతుకమ్మోలెనే నెత్తికెత్తుకున్నం
మార్జాల న్యాయాన్నే కుద్దుగ అనుసరించినం

పిల్లల్ని సంకనేసుకోవడమంటే
వాళ్ళను మురిపెంగ అదిమి పట్టుకోవడమే
కూనలే సరిగ్గా సంకలకు రావడమంటే
తల్లి కడుపు కింద మేకగంటకాల్లా యాల్లాడపడడమే
పసి పిల్లలే తల్లిని వొడుపుగ పట్టుకోవడమంటే
తుమ్మ బంకోలిగ గట్టిగా అతుక్కుపోవడమే
గట్లా నిన్ను బేఫికరుగా ఏనాడూ సాదలే
మర్కట న్యాయంతో అసలే మసులుకోలే

తల్లి సందిటా తండ్రి కౌగిటనే మెదిలినవు
ఇయ్యాల గూడు యిడ్సిన గువ్వలోలెనే పసితనం
బెదురు చూపులతో బగ్గ బెంగటీలుతూ
బొత్తిగ దిగులు మొగులు కమ్ముకొన్న లెక్కనే
పొట్టాపతికి తల్లులు మ్యాతకెళ్లిన యాళ్ల
పొదినే తల్లయి గొర్రెబొక్కులను కాపాడినట్టు
గిప్పుడు పూటకూళ్ల ఇల్లు సుతా గట్లనే అన్నట్లు
ఇగ ఎవలమైన మనుసు నిమ్మలం జేసుకొనుడే కావాలే

చితుకుబొతుకుల జీవిత గమనంల
జంగ పిల్లుల జాడలను జాగరుకతతో పసిగట్టాలే
గద్దల గడుసుదనాన్ని గుడ్డిగనే గురుతెరుగాలే
డ్యాగల మొండి వాట్లకెల్లి అల్కగ తప్పించుకోవాలే
తల్లికోడి పిల్లలను ఎడబాపడం లాంటిదే
ఊరవతలి చదువుసంజెలను అందుకోవడమంటే
ఇగ మనం గుడ్ల నీళ్ళను గుడ్లల్లనే కుక్కుకోవడమే

ఎన్కటికెల్లి మనిట్ల ఎవ్వలకూ అచ్చురం పోకడ తెల్వది
మనమంటేనే చదువులమ్మ అంటిముట్టనట్టుండేది
మొన్నమొన్ననే గ్యాసునూనె దీపం కొడల నెనరు
ముంగురులపయి ముచ్చట పడి కమిరిచ్చింది
ముక్కు పుటల్ల ముసురుకొన్న మసికసిగా
ఇన్నేళ్ల చీకటిపయి చాలుతనపు అసిని దూసింది
తల్కాయకు చదువుసమరు ఇంతంత ఇమిడీ ఇమడనట్టు
నిదుర దేవర ఆవులింతల్ల ఆవగింజంతనే అంటిదాయే
గిప్పుడు విద్దెను నివద్దిగ నీ వశం జేసుకోవాలే
అచ్చుల కచ్చురాలను మలుపుకోవాలే
హల్లుల పొల్లులను తూర్పార వట్టాలే
అచ్చురాన్ని మ్యాక మరకపిల్లగ మల్సుకొని
మనింటి ముందటి పందిరి గుంజకు తలుగుతో కట్టెయ్యాలే

ఒరేరు… నాయన భారవీ!
ఈ నకమొకాల కాలం ఒక్క తీరుగ ఉండది
అండ్లదండ్లనే కండ్లవడకుండ కలె తిరుగుతది
చిత్తుబొత్తులను బొత్తిగ కలుగాబులగం జేత్తది
ఇపుడు మోరదోపు కాలమే దాపురించింది
ఉత్తుత్తగనే బట్టకాల్చి మీదేత్తది
నిక్కుడు పుంజోలే నీలాప నిందల పాల్జేత్తది
చెడ్డ సోపతి తొవ్వ నాశనం జేత్తది
జర పైలంరా… పైలం…
సల్లంగుండు బిడ్డా! సల్లంగుండు…
హుఁ… ఉంటా… మరీ!
(నా కొడుకు సాయిభారవిని బి.టెక్‌. హాస్టల్లో వదిలినపుడు)
– కూకట్ల తిరుపతి, 9949247591