మహలక్ష్ముల తీర్థయాత్రలు

  • పెరిగిన మహిళల ఉచిత ప్రయాణం

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో అతివల ప్రయాణాలు అనూహ్యంగా పెరిగాయి. ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న తీర్థ యాత్రలను పూర్తి చేస్తున్నారు. వివిధ ఆలయాల్లో తీర్చాల్సిన మొక్కులకు మోక్షం కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. దైవదర్శనానికి వెళ్లేందుకు టికెట్‌ భారంతో వెనుకడుగు వేసే వారు ప్రస్తుతం ఉచిత ప్రయాణాన్ని అందిపుచ్చుకొని గుడులను చుట్టొస్తున్నారు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉన్న ఆలయానికైనా ఉదయం వెళ్లి రాత్రికి వచ్చే అవకాశం ఉండడంతో యాత్రల జోరు పెరిగింది. యాదగిరిగుట్టకు మహిళలు భారీ సంఖ్యలో వెళ్లొస్తున్నారు. గతంలో రోజుకు 21 వేల మంది మహిళలు వెళ్తే.. ప్రస్తుతం 33 వేల మంది వెళ్తున్నట్లు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఒక్క రోజులో వివిధ దేవాలయాలకు గతంలో 86263 మంది మహిళా భక్తులు వెళ్తే.. మహాలక్ష్మి పథకం తర్వాత వారి సంఖ్య 1,57,089కు పెరిగింది.