సీఎం రేవంత్‌పై పింక్‌ మీడియా దుష్ప్రచారం

– ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, మేడిపల్లి సత్యం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పింక్‌ మీడియా, బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. గురుకులాలపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సీల్పీ కార్యాలయంలో వేర్వేరుగా వారు విలేకర్లతో మాట్లాడారు. గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ప్రవీణ్‌కుమార్‌ నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు 40శాతం డైట్‌ చార్జీలు పెంచడంతోపాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మంచి భోజనం అందిస్తుంటే, బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేక ఫుడ్‌ పాయిజన్‌ అంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో ఎంత దుష్పచారం చేసినా ఎప్పటికైనా ప్రజలకు నిజాలు తెలుస్తుందన్నారు. పదేండ్లపాటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి కనీసం డైట్‌ఛార్జీలు పెంచలేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్‌ఎస్‌ నేతలకు జ్ఞానోదయం కలగడం లేదన్నారు.