మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణలో భారతదేశం ఎంతగా వెనకబడి ఉందో దివ్య బాలాజీ కమెర్కర్‌కు ఆమె అనుభవాలు అర్థమయ్యేలా చేశాయి. అన్ని రంగాల్లో సాంకేతికత దూసుకుపోతున్నా మహిళల ఆరోగ్యానికి అది అంతగా ఉపయోగపడకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఆ లోటును భర్తీ చేసేందుకు రెండేండ్లు తీవ్ర అధ్యయనం చేసి పింకీ ప్రామిస్ అనే డిజిటల్-ఫస్ట్ కేర్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించారు. అసలు దాని సంగతేంటో, అది ఎలా పని చేస్తుందో మనమూ తెలుసు కుందాం…
కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచాన్ని తాకినప్పుడు దివ్య గర్భవతి. అలాగే వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ చదువుతోంది. ప్రసవం కోసం భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపించాయి. కరోనా కారణంలో ఆన్‌లైన్‌లో గైనకాలజిస్ట్‌ని సంప్రదించాను. నాకొచ్చిన సమస్య తెలుసుకోడానికి రెండు వారాలు పట్టింది. సరైన పద్ధతిలో వైద్యం జరిగి ఉంటే నా సమస్య గురించి వారంలోపే తెలుసుకోగలిగేవాళ్లం’ అంటూ దివ్య గుర్తు చేసుకున్నారు.
క్లిష్టమైన అంతరం
తన అనుభవంతో భారతదేశ ఆరోగ్య సంరక్షణలో ఓ క్లిష్టమైన అంతరాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన అనేక ఆరోగ్య సంస్థలు ఉన్నప్పటికీ డీప్‌టెక్, ఏఐ (ఆర్టిఫిషన్ ఇంటిలిజన్స్)ను పెద్దగా ఉపయోగించడంలేదని ఆమె గ్రహించారు. ‘ఆ లోటును భర్తీ చేయడానికే భారతదేశంలో మొదటి AI/ML-ఆధారిత క్లినిక్‌గా పింకీ ప్రామిస్‌ను ప్రారంభించాను. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడి సమగ్ర, కచ్చితమైన వైద్య సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని ఆమె పంచుకున్నారు.
వైవిధ్యమైన అనుభవాలు
దివ్య యేల్ యూనివర్శిటీ నుండి ఎకాలజీలో డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత హెచ్‌ఐవీ నుండి మహిళలకు రక్షణ కల్పించే యాక్సెస్ కోసం టాంజానియాకు వెళ్లారు. అక్కడి నుండి వచ్చి బీహార్‌లో పోషకాహార లోపాలను మెరుగుపరిచే ప్రాజెక్ట్‌లో పని చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న హింసను తగ్గించేందుకు ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ కోసం కూడా ఆమె పనిచేశారు. ‘నిర్భయ ఘటన నా ఇంటికి కొద్ది దూరంలో జరిగింది. అప్పటి నిరసనల్లో పాల్గొన్నాను. జస్టిస్ వర్మ కమిషన్ ఢిల్లీ సూచనలను రూపొందించడంలో సహాయపడ్డాను’ అని ఆమె చెప్పారు. యేల్‌లోని ఆమె సహవిద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా ఆమె మాత్రం ఎన్జీఓలతో పని చేస్తూ నెలకు రూ. 30,000 జీతం తీసుకునేవారు. ఆమె బ్రిడ్జ్‌స్పాన్ గ్రూప్ కోసం సోషల్ ఇంపాక్ట్ కన్సల్టింగ్‌లో పనిచేసేటపుడు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ గురించి చాలా నేర్చుకున్నారు.
డిజిటల్-ఫస్ట్ కేర్ ప్లాట్‌ఫారమ్
పింకీ ప్రామిస్ ఆలోచన వేళ్లూనుకున్నప్పుడు దివ్య దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలతో మాట్లాడి లోతుగా అధ్యయనం చేశాడు. 2022లో స్త్రీ జననేంద్రియ సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారు ఏమి చేశారో అర్థం చేసుకోవడానికి 300 కంటే ఎక్కువ మంది మహిళలను పోల్ చేశారు. ఫలితాలు ఆమె కండ్లు తెరిపించాయి. ‘70% కంటే ఎక్కువ మంది స్త్రీలు వైద్యుల వద్దకు వెళ్లాలని తెలిసినప్పటికీ వెళ్లకుండా తప్పించుకున్నారు. 73% మంది తమ సమస్యల గురించి ఎవరితోనూ పంచుకోకుండా వాటి లక్షణాల గురించి రహస్యంగా ఆన్‌లైన్‌లో సర్చ్ చేశారు. మహిళలకు డిజిటల్-ఫస్ట్ కేర్ ప్లాట్‌ఫారమ్ అవసరం ఎంత ఉందో ఈ పోల్ మాకు చెప్పింది’ ఆమె వివరించారు.
ఎలా పని చేస్తుందంటే..?
పింకీ ప్రామిస్ అనేది ఒక ఫోకస్డ్ స్ట్రాటజీపై రూపొందించబడింది. అధునాతన AI/ML టెక్నాలజీని ఉపయోగించుకోవడం, మహిళల ఆరోగ్య డేటాపై ప్రత్యేకంగా శిక్షణ పొందడం, వేగవంతమైన, కచ్చితమైన ఆరోగ్య సంరక్షణను అందించడం దీని కర్తవ్యం. యాప్‌లోకి ప్రవేశించిన తర్వాత మీరు వెంటనే గైనకాలజిస్ట్‌ని కనెక్ట్ చేయవచ్చు. అదే సమయంలో చాట్‌బాట్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటిని డాక్టర్ వారి యాప్‌లో పరిశీలిస్తారు. ప్రశ్నలు కూడా మునుపటి ప్రతిస్పందనల ఆధారంగా అనుకూలీకరించబడ్డాయి. వైద్యులు రోగిని అదనపు ప్రశ్నలు అడగవచ్చు. చాట్‌బాట్ 250కి పైగా టాప్ మెడికల్ ప్రోటోకాల్‌లపై కస్టమ్-ట్రైన్ చేయబడింది. వైద్య నిపుణులచే పరిశీలించబడింది. అందుకున్న డేటా ఆధారంగా నిరంతరం నవీకరించబడుతుంది. బోట్ ప్రశ్నలు, సమాధానాల ఆధారంగా మందులను కూడా సూచిస్తుంది. దానిని రోగితో పంచుకునే ముందు డాక్టర్ చూస్తారు.
హెల్త్‌టెక్‌పై దృష్టి సారించి
యాప్‌లో ఒక మహిళ 97% పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల కోసం తక్షణమే సంప్రదించవచ్చు. ప్లాట్‌ఫారమ్ రూ. 99కి ఇన్‌స్టంట్ చాట్ కన్సల్టేషన్‌లను, రూ. 199కి వాయిస్ కన్సల్టేషన్‌లను, రూ.99-2,400 నుండి కేర్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. దివ్య రెండు ఏండ్ల పాటు శ్రమించి తన ఇంటి నుండి పింకీ ప్రామిస్‌ను నిర్మించారు. 2023లో ఆమె భర్త స్నేహితురాలు ఆకాంక్ష వ్యాస్ ఆమెతో చేరింది. హెల్త్‌టెక్‌పై దృష్టి సారించి AI ఉత్పత్తులను నిర్మించడంలో ఆకాంక్షకు 12 ఏండ్ల అనుభవం ఉంది. టైర్ I, టైర్ II నగరాల్లో 18-34 ఏండ్ల మధ్య వయసున్న మహిళలే పింకీ ప్రామిస్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రేక్షకులు. ‘మా కస్టమర్‌లలో సుమారు 70% మంది టైర్ 2, దేశంలోని చిన్న ప్రాంతాల నుండి వచ్చారు. 60% కంటే ఎక్కువ మంది ఇంతకు ముందెప్పుడూ గైనకాలజిస్ట్‌ని సంప్రదించలేదు. పింకీ ప్రామిస్‌పై మొదటిసారి సంప్రదిస్తున్నారు’ అని దివ్య పంచుకున్నారు.
ఆకట్టుకునే వృద్ధి
పింకీ ప్రామిస్ దాదాపు 80,000పైగా యాప్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. 10,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లకు సేవలు అందిం చింది. ప్రారంభమైన కొత్తలో దివ్య దీన్ని తన సొంత నిధులతో నడిపారు. తర్వాత గ్రాంట్లు, అవార్డులు అందుకుంటున్నారు. ‘ములాగో ఫౌండేషన్ మాకు 100,000 డాలర్లు ప్రదానం చేసింది. USAID మరో 100,000 డాలర్లు ఇచ్చింది. వీరితో పాటు మాకు మద్దతు ఇచ్చిన వారిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు’ అని దివ్య చెప్పారు. రాబోయే 12 నెలల్లో పింకీ ప్రామిస్ నంబర్ వన్ మహిళా ఆరోగ్య బ్రాండ్‌గా నిరూపించుకోవాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.