ప్రమోషన్‌లో పైరవీలు

Followers in promotion– ఆర్టీసీలో అక్రమంగా ప్రమోషన్‌
– నకిలీ కుల ధృవీకరణతో పలువురికి ఏడీసీగా ప్రమోషన్‌
– ట్రెయినింగ్‌ పూర్తయి విధుల్లో చేరిన వైనం
– నష్టపోయిన అర్హులు
– ఫిర్యాదు అందలేదంటు విజిలెన్స్‌ దాటవేత..?
– విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశం
నవతెలంగాణ-నిజామాబాద్‌ డెస్క్‌
ఆర్టీసీలో ఇటీవల పలువురు కండక్టర్‌లకు, డ్రైవర్‌లకు ఏడీసీలుగా ప్రమోషన్‌ కల్పించారు. రిజర్వేషన్‌ల ఆధారంగా ప్రమోషన్‌లు ఇచ్చారు. వీరికి ఇటీవల వరంగల్‌లో ట్రెయినింగ్‌ సైతం పూర్తయి ఇటీవల విధుల్లో చేరారు. అయితే ప్రమోషన్‌లలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. పలువురు ఉద్యోగులు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా ప్రమోషన్‌లు పొందినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాము నష్టపోయామని పలువురు అర్హులు వాపోతున్నారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రమోషన్‌ పొందిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగం మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే విచారణ చేపడతామని పేర్కొనడం గమనార్హం.
ఆర్టీసీలో నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. నిజామాబాద్‌ -1, 2తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడలో డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలోని డ్రైవర్‌లతో పాటు కండక్టర్‌లకు అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌/ కంట్రోలర్‌(ఏడీసీ)గా ప్రమోషన్‌లు కల్పించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రీజియన్‌ పరిధిలో మొత్తం 25 మందికి ఏడీసీగా ప్రమోషన్‌ కల్పించారు. ప్రమోషన్‌లో భాగంగా రిజర్వేషన్‌ ఆధారంగా పలువురికి ప్రమోషన్‌ వచ్చింది.
నకిలీ కులధ్రువీకరణతో ప్రమోషన్‌
కాగా ప్రమోషన్‌లలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఓ డిపోకు చెందిన ఉద్యోగి నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ప్రమోషన్‌ పొందినట్టు సమాచారం. ప్రమోషన్‌లు కల్పించే సమయంలో కనీస ఎంక్వైరీ లేకపోవడంతో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు దళితసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో సైతం ఇదే విధంగా పలువురు ఉద్యోగులు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రమోషన్‌ తీసుకొని.. తమ బండారం ఎక్కడ బయటపడుతదో అని భయాందోళనతో మధ్యలో వాలంటీర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకోవడం గమనార్హం. ఇటీవల సైతం ఓ ఉద్యోగి నకిలీ కుల సర్టిఫికేట్‌తో ప్రమోషన్‌ పొందినట్టు తేలడంతో సదరు ఉద్యోగికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను ఆర్టీసీ సంస్థం నిలిపివేసింది. హైకోర్టుకు వెళ్లిన ఎలాంటి ప్రయోజనం సైతం దక్కలేదు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ.. నకిలీ సర్టిఫికేట్‌లతో ప్రమోషన్‌లు పొందుతున్నారని, అలాంటి వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలనాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ప్రమోషన్‌లు పొందిన వారిపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఆర్టీసీ విజిలెన్స్‌ స్పందించి విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని, తమకు అవకాశం వస్తుందని ప్రమోషన్‌కు అర్హులైన పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేవు : ఆర్‌ఎం కె.జానిరెడ్డి
సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసి పారదర్శకంగా ప్రమోషన్‌లు కల్పించాం. గతంలో కూడా 70 మందికి ప్రమోషన్‌లు ఇచ్చాం. ఇప్పుడు అవకాశం రావడంతో మరో 25 మందికి ప్రయోజనం కల్పించాం. అక్రమాలు జరిగినట్టు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేవు. అలా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.