బైడెన్‌ కలిసిన పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను శుక్రవారం కలిశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సులో బైడెన్‌తో గోయల్‌ సమావేశమయ్యారు. ఈ మేరకు ఎక్స్‌లో బైడెన్‌తో సంభాషిస్తున్న ఫొటోను గోయల్‌ షేర్‌ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అని మంత్రి ట్వీట్‌ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ గురించి పలు అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ ప్రస్తావించిన అంశాలతో అంగీకరిస్తున్నట్టు బైడెన్‌ తనతో చెప్పారని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన పీయూష్‌ గోయల్‌.. జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదాతోపాటు పలు దేశాలకు చెందిన మంత్రులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. మరోవైపు బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో మొత్తం 26 అంశాల్లో 20 ముగించామని తెలిపారు. అనిశ్చితి నెలకొన్న అంశాలను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు. అదే విధంగా 2023-24 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు పేటెంట్‌లు జారీ చేసినట్టు తెలిపారు. దేశ యువత సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇది గొప్ప పురోగతిగా మంత్రి పేర్కొన్నారు.