నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ) సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ జీ చిన్నారెడ్డి ప్రజాభవన్‌లో వారితో భేటీ అయ్యారు. ఏఈఓలు తరచూ సమ్మె బాట పడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాథాన్యత ఏర్పడింది. పని ఒత్తిడి, వ్యవసాయ ఉన్నతాధికారుల వైఖరితోనే తమకు సమస్యలు ఏర్పడుతున్నాయని ఈ సందర్భంగా ఏఈఓలు తెలిపారు.
క్రాప్ డిజిటల్ సర్వే పనుల్లో తమకు సహాయకలను నియమించాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్, మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యోగులను క్రాప్ డిజిటల్ సర్వే పనుల్లో తమకు సహకారం అందిస్తే పనిఒత్తిడి తగ్గుతుందని అభ్యర్థించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా వైస్ చైర్మెన్ హామీ ఇచ్చారు. త్వరలో మరికొందరు ఏఈఓల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామన్నారు. సమావేశంలో వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మెన్ బొమిరెడ్డి కృపాకర్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ఉన్నతాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏఈఓ సంఘం ప్రతినిధులు ఆనంద్, వెంకటేష్, రాజు, వెంకన్న, సురేష్, రాధమ్మ, రాజేశ్వరి, లలిత, తదితరులు పాల్గొన్నారు.