ప్రణాళికలు సరే… ఫలితాలేవి…?

మొన్నటిదాకా కానరాని వాన గతవారం రోజుల నుంచి దంచి కొడుతోంది. మోస్తరుగా మొదలై… భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లటం, రోడ్లు తెగిపోవటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఇంకో మూడు నాలుగు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ వాతావరణశాఖ ప్రకటించింది. ఆరెంజ్‌, ఎల్లో, రెడ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఈ పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఇదంతా సరే… కానీ గతంలో ఇలాగే కుంభవృష్టి కురిసి పరిస్థితి అదుపు తప్పినప్పుడు సర్కారు అనేక ప్రకటనలు వెలువరించింది. వరద పోటెత్తి నగరాలు, పట్టణాల్లోని రోడ్లు, వీధులు, గల్లీలను ముంచెత్తకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తామంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెల్లడించిన విషయం విదితమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) పేరిట హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, ఇతర పట్టణాల్లో దీన్ని అమలు చేస్తామంటూ సర్కారు స్పష్టీకరించింది. తద్వారా వరదను మళ్లించేందుకు పక్కా ప్రణాళిక, అధునాతక సాంకేతిక పద్ధతుల్లో నాలాలను, వరద కాల్వలను నిర్మిస్తామంటూ ప్రకటించినప్పటికీ నేటికీ ఆయా పనులు నత్తనడకన సాగుతుండటం బాధితులకు నిజంగా శాపమే. దీంతో షరా మామూలుగా ఇప్పుడు మళ్లీ కాలనీలు, బస్తీలు నీటిలో మునకేస్తున్నాయి. పెద్ద పెద్ద అపార్టుమెంట్ల సెల్లార్లలో సైతం కార్లు, బైకులు తేలియాడుతున్నాయి.
మరోవైపు గతేడాది గోదావరి పోటెత్తి భద్రాచలాన్ని ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయానా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. దాంతోపాటు ములుగు, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల్లోనూ ఆయన ఆ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా బాధితులకు భరోసానిచ్చారు. భద్రాద్రికి రూ.వెయ్యి కోట్లను కేటాయిస్తున్నామంటూ ప్రకటించటం ద్వారా ఆ సమయంలో అక్కడి ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా హామీనిచ్చారు. గోదావరికి కరకట్ట నిర్మించటం ద్వారా భద్రాచలంతోపాటు పరిసర ప్రాంతాలను ముంపు బారి నుంచి కాపాడతామంటూ సీఎం ప్రకటించారు. బాధితులకు అప్పట్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల హామీని కూడా ఆయనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి వాగ్దానం నెరవేరకపోవటం బాధితులను ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. పైగా అతి భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో భద్రాచలం వద్ద బుధవారం మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయటం గమనార్హం.
ఈ రకంగా ప్రతీ వర్షాకాలంలోనో లేక అతివృష్టి సంభవించి వరుణుడు కుంభవృష్టి కురిపించినప్పుడో రాష్ట్రం తల్లడిల్లిపోవటం సర్వసాధారణమైపోయింది. పట్నం పల్లె అనే తేడా లేకుండా వరద పారటం, బాధితులు ఓ పది రోజులపాటు నీటిలో నానటం షరా మామూలైంది. వాన రావటం, దాన్ని ఆపటమనేది మన చేతిలో లేదు. కానీ వరదను నియంత్రించటం, ఆ నీటిని మళ్లించటమనేది మన చేతిలో ఉన్నదే కదా..? అలాంటప్పుడు దాన్ని నివారించేందుకు, నియంత్రించేందుకు ప్రభుత్వం వేస్తున్న, వేసిన ప్రణాళికలు ఏమైపోతున్నట్టు..? ఏండ్లు గడిచినా వాటి ఫలితాలను ఎందుకు రాబట్టలేకపోతున్నాం..? అనే అంశంపై లోతైన చర్చ జరగాలి. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది.
ప్రణాళికలేయటంతోపాటు చెరువులు, కుంటలు, నదుల పరివాహ ప్రాంతాలను పరిరక్షించటంపై కూడా సర్కారు దృష్టి సారించాల్సిన అవసరమెంతో ఉంది. ఇసుక తవ్వకాలు, అక్రమ కట్టడాల కోసం ఇష్టానుసారంగా నీటి ప్రవాహాలకు అడ్డుకట్టలేయటం, నచ్చిన పద్ధతుల్లో కబ్జా చేసుకుంటూ పోతే ప్రకృతి ప్రకోపించక మానదు. నగరాల్లో సైతం చెరువులను ఆక్రమించి, వాటి శిఖం భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, టవర్లు, అపార్టుమెంట్లను నిర్మిస్తున్న వైనాలు కోకొల్లలు. వరద ముప్పును అరికట్టే నాలాలను సైతం కంటికి కనబడకుండా కబ్జా చేస్తున్నారంటే పరిస్థితి ఎంతలా అదుపు తప్పిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వరదలను నియంత్రించాలంటే ముందు ఇలాంటి ఆగడాలన్నింటినీ అరికట్టాల్సిందే.