మొక్కలను నాటి సంరక్షించాలి

Plants should be preserved– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ 
– హాస కొత్తూర్ లో స్వచ్ఛదనం -పచ్చదనం పరిశీలన 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో కొనసాగుతున్న స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్యన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడ స్థలంలో అధికారులతో కలిసి మొక్కను నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో, స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. మొక్కలను నాటి  కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, మొక్కలను  సంరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.మొక్కలు నాటితే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.నాటిన ప్రతి మొక్కను పశువులు మేయకుండా మొక్కలకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అన్నారు. ప్రస్తుతం మనం నాటిన మొక్కలే వృక్షాలై మన భవిష్యత్తు తరాలకు ప్రాణ వాయువును అందిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం రెండు మూడు మొక్కలు నాటి, నాటిన మొక్కలను కాపాడేందుకు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయించి దోమలు వృద్ది చెందకుండా బీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు.అంతకు ముందు ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు.కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.