నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ (హిప్లెక్స్-2023)ను ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యాన్‌ఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టీఏఏపీఎమ్‌ఏ) అధ్యక్షులు విమలేష్‌గుప్తా, హిప్లెక్ చైర్మెన్ బీఎల్ భండారి, మాజీ అధ్యక్షులు వీ అనిల్‌రెడ్డి తెలిపారు. సోమవారంనాడిక్కడి ఎఫ్‌టీసీసీఐలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజులు జరిగే ఈ ఎక్స్‌పోలో దాదాపు రూ.500 కోట్ల విలువైన వ్యాపారం నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. 500 మంది ఎగ్జిబిటర్లు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారనీ, 50వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తున్నాయన్నారు ప్రపంచ తలసరి సగటు ప్లాస్టిక్ వినియోగం 65 కిలోలుగా ఉందనీ, భారత్‌లో ఇది 32-35 కిలోలుగానే ఉందన్నారు. అమెరికాలో 70-75 కిలోల వినియోగం జరుగుతుందన్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో వినిమయం తక్కువగా ఉన్నదనీ, ఈ రంగంలో వ్యాపారం, ఉపాధికి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు.