ఆట అమ్మాయిలకు శక్తినిస్తుంది

అదితి చౌహాన్‌… మహిళల సూపర్‌ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇది ఆమె జీవితంలో ఓ గొప్ప మలుపు. ప్రస్తుతం ఎంతో మంది యువతులు ఈ క్రీడలోకి వచ్చేలా ప్రోత్సహిస్తున్న ఆమె తన ఫుట్‌బాల్‌ ప్రయాణం గురించి, వెస్ట్‌ హామ్‌ లేడీస్‌ యునైటెడ్‌లో తన పని గురించి, తన అభిరుచి ప్రాజెక్ట్‌ అయిన షీ కిక్స్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ గురించి ఇలా పంచుకుంటుంది.

2017లో అదితి వెస్ట్‌ హామ్‌ లేడీస్‌ యునైటెడ్‌ తరపున ఆడుతున్నప్పుడు మోకాలి గాయం అయింది. దాంతో ఆమె ఉమెన్స్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌కు దూరంగా ఉంది. ”గాయం తర్వాత ఏ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. కానీ నేను మాత్రం అలా చేయలేదు. గాయం తగ్గిన తర్వాత తిరిగి ఆడడం మొదలుపెట్టాను” అని చౌహాన్‌ చెప్పారు.

మరోసారి గాయం
చెన్నైలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నేపాల్‌తో స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు ఆమెకు మరోసారి గాయం అయ్యింది. శస్త్రచికిత్సకు ముందు ఓ వెబ్‌సైట్‌తో తన భావాలను పంచుకుంది. ఏప్రిల్‌ 26న ప్రారంభమైన ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌ తప్పిపోయినప్పటికీ మరో బలమైన పునరాగమనం చేస్తాననే నమ్మకంతో ఉంది. ”నేను మైదానంలోకి తిరిగి వచ్చా నంటే, భారతదేశం కోసం మళ్లీ ఆడటం ప్రారంభించానంటే నాకు ఉన్న అతిపెద్ద ప్రేరణ నమ్మకం” ఆమె చెప్పారు. గోల్‌ కీపర్‌గా గత 14 ఏండ్లగా భారత జట్టు కోసం ఆడిన అదితి జాతీయంతో పాటు క్లబ్‌ సర్క్యూట్‌లో మహిళల ఫుట్‌బాల్‌లో అత్యంత గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు. 2018-19, 2021-22లో ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌(×ఔూ)లో గోకులం కేరళ ఖీజకి రెండు విజయాలు అందించారు.
ఫుట్‌బాల్‌ మొదటి ఎంపిక కాదు
వాస్తవానికి అదితికి ఫుట్‌బాల్‌ మొదటి ఎంపిక కాదు. ఆర్మీ కుటుం బంలో పుట్టిన ఆమె దేశం చుట్టూ తిరి గారు. తైక్వాండో ప్రాక్టీస్‌ చేస్తున్న అన్నయ్య ప్రభావం ఆమెపై ఉండేది. అదితి నాల్గవ తరగతి చదువుతున్న ప్పుడు చదువు కోసం పిల్లల్ని ఢిల్లీకి పంపాలని కుటుంబం నిర్ణయించుకుంది. ”చిన్నప్పటి నుండి బయటి ఆటలు ఆడటానికే ఇష్టపడే దాన్ని. స్కూల్లో కూడా అన్ని రకాల క్రీడల్లో చురుగ్గా ఉండేదాన్ని. అంతర్‌ జిల్లా బాస్కెట్‌ బాల్‌, అథ్లెటిక్స్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ ఆడేదాన్ని. అండర్‌-19 మహిళల ఫుట్‌బాల్‌ జట్టు కోసం ట్రయల్‌కు హాజరు కావాలని నా కోచ్‌ చెప్పడంతో బాస్కెట్‌బాల్‌ వైపు మొగ్గుచూపాను” అదితి అన్నారు.
మూడో ఛాయిస్‌గా ఎంపికైంది
రైలులో ప్రయాణించవచ్చు అనే ఆసక్తితో అదితి ఫుట్‌బాల్‌కు ఒప్పు కున్నారు. ఆమె అప్పటికే అథ్లెటిక్‌ కావడంతో గోల్‌కీపర్‌గా ప్రయత్నించమని కోచ్‌ సూచించాడు. ట్రయల్స్‌లో ఆమె మూడో ఛాయిస్‌గా ఎంపికైంది. ఫుట్‌బాల్‌ ఆడటం ప్రారంభించినప్పుడు మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు గురించి ఆమెకు ఏమీ తెలియదు. పెద్దగా ప్రోత్సాహం కూడా ఆమెకు లభించలేదు. అదితి నిర్ణయం పట్ల తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. ”క్రీడలు ఆడాలనుకుంటే సింగిల్‌గా ఆడేవు ఎందుకు ఎంచుకోకూడదని మా నాన్న నన్ను అడిగారు. నాకు కుటుంబం మద్దతు ఇవ్వలేదు. వారికి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సవాలు. తదుపరి దశ ఏమిటి, దాని గురించి ఎలా వెళ్లాలి, ఎలాంటి శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో మాకు తెలియదు” అని చౌహాన్‌ చెప్పారు.
వెస్ట్‌ హామ్‌ యునైటెడ్‌లో…
అదితి తనంతట తానుగా అన్ని విషయాల గురించి తెలుసుకుంది. ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నారు. లక్ష్యం గోల్‌కీపర్‌కి మొదటి ఎంపికగా ఉండాలి. ఆమె 14 ఏండ్లు ఆడిన తర్వాత భారత సీనియర్‌ మహిళల జట్టులో చోటు సంపాదించారు. మధ్యలో యూనివర్శిటీ ఆఫ్‌ లాఫ్‌బరోలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి ఆమె యూకే వెళ్లారు. వెస్ట్‌ హామ్‌ యునైటెడ్‌లో చేరారు. మహిళల సూపర్‌ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా నిలిచింది.
అత్యున్నత స్థాయికి చేరేలా…
అదితి ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ వెనుకబడిన బాలికలు ఫుట్‌బాల్‌ ప్లేయర్‌లుగా మారడా నికి మద్దతు ఇస్తుంది. ”గత ఏడాది జనవరి నుండి మేము నిరుపేద కుటుంబాలకు చెందిన 30 మంది బాలి కలకు ఉచిత ఫుట్‌బాల్‌ కోచింగ్‌ ఇస్తున్నాము. మేము వారికి ఉచిత రవాణా కూడా ఏర్పాటు చేస్తాము. ఢిల్లీ క్లబ్‌ సర్క్యూట్‌లో ఆడే షీ కిక్స్‌ ఖీజ అనే క్లబ్‌ను కూడా నమోదు చేసాము” అని ఆమె పంచుకున్నారు.

ఉచిత ఫుట్‌బాల్‌ కోచింగ్‌ 
”క్లబ్‌ పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. జాతీయ జట్టు లేదా ఇతర వృత్తి పరమైన క్లబ్‌లచే స్కౌట్‌ చేయ డానికి, సామాజిక, ఆర్థిక మార్పు కు అవకాశాలను తెరవడానికి బాలికలకు వేదికను అందిస్తుంది. ఆట ఆడపిల్లలను శారీరకంగా సవాలు చేస్తుంది. మానసికంగా ఒక స్టాండ్‌ తీసుకోవడానికి, అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి వారికి శక్తిని స్తుంది. ప్రతి అమ్మాయి అత్యున్నత స్థాయికి చేరుకోక పోవచ్చని అర్థం చేసుకున్నాను. అయితే క్లబ్‌ కొనసాగించడం అంత సులభం కాదు. అందుకే మేము ప్రోగ్రామ్‌కు నిధులు సమకూర్చడానికి క్రౌడ్‌ఫండింగ్‌ స్పాన్సర్‌లను చూస్తున్నాము” అని ఆమె అంటున్నారు.

అవగాహన కల్పించేందుకు
”ఆట నన్ను మంచి వ్యక్తిని చేసింది. ఎందుకంటే నేను నా సొంతంగా జీవించడం నేర్చుకున్నాను. నాకు కావల్సినవి నేనే చూసుకో గలుగుతున్నాను. ఒక సైకిల్‌ కొన్నాను. దాంతో రైలు ప్రయాణంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు” అని ఆమె జతచేస్తున్నారు. ఆమె గాయం నుండి తిరిగి కోలుకొని వచ్చిన తర్వాత భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్‌లో అట్టడుగు స్థాయిలో పెద్దగా మార్పు రాలేదని ఆమె గ్రహించారు. క్రీడపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2019లో షీ కిక్స్‌ ఫుట్‌బాల్‌ అకాడమీని ప్రారంభించారు.