ఆటలు ఆడించండి

Play gamesప్రపంచంలో అత్యధికంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు కలిగిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దేశంలో దాదాపు కోటి యాభై లక్షల మంది చిన్నారులు ఉండాల్సిన బరువుకంటే ఎక్కువగా ఉంటున్నారని ఆ అధ్యయనంలో బయటపడింది. అంటే భావి భారతం ఎంత అనారోగ్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో పిల్లలు ఆడుతూ పాడుతూ గెంతుతూ ఉండేవారు. కానీ నేటి పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. శారీరక ఆటలకు దూరమైపోతున్నారు. అందుకే ఈ పరిస్థితి. తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎప్పుడూ ఆటలేనా.. ముందు వెళ్లి చదువుకో.. అంటూ పిల్లలపై అరిచే తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాం. ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు. రోజూ ఆడుకునే పిల్లలు చదువులో కూడా టాప్‌గా ఉంటారంటున్నారని కూడా చెబుతున్నారు. కనుక పిల్లలకు చదువెంతముఖ్యమో ఆటలు ఆడటమూ అంతే ముఖ్యం.
కొన్నేండ్ల కిందట స్కూల్‌ నుంచి రాగానే బ్యాగ్‌ పడేసి, కాళ్లు కూడా కడుక్కోకుండా, స్నాక్స్‌ కూడా తినకుండా గ్రౌండ్‌కి ఆడుకోడానికి పరిగెత్తేవాళ్లు పిల్లలు. ఎక్కడ, ఏ గల్లీలో చూసినా క్రికెట్‌ ఆడుతూనో, చార్పత్తాలు ఆడుతూనో కనిపించేవాళ్లు. కానీ ఇప్పటి పిల్లలను చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్లకు ఆటలే లేవు. స్కూల్‌ నుంచి రాగానే గ్రౌండ్‌కి వెళ్లడానికి బదులు ఫోన్లు పట్టుకుంటున్నారు. స్కూల్‌లో కూడా ఆట స్థలాల్లో విహంగాల్లా విహరించడానికి బదులు తరగతి గదులనే పంజరాల్లో బందీలై పోతున్నారు.
నేటి పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస లేదు. ఆరుబయట ఆటలు లేవు. క్లాస్‌ రూమ్‌లో చదువు.. ఆ తర్వాత స్టడీ అవర్స్‌. ఇంటికి వచ్చిన తర్వాతా చదువే. ఇక ఆడుకునే టైం ఎక్కడిది..? సరదాగా గంతులేస్తూ ఆడుకోవాల్సిన వయసులో మొబైల్లో గేమ్స్‌కు అతుక్కుపోతున్నారు. ఈ కారణంగా పిల్లల గ్రహణశక్తి కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఆటలు శారీరక ఆరోగ్యానికే గాక చదువుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు. అందుకే పిల్లలను చదివించడంతో పాటు ఆటలు కూడా ఆడించాలి.
పిల్లల శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి, ఎదుగుదలకి ఆటలు ఓ వ్యాయామంగా పనిచేస్తాయి. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం పిల్లలు చదువులో రాణించాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. సమస్యను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత మెరుగుపడతాయి రుజువయ్యింది. స్కూల్‌ పిల్లలకు మాత్రమే కాదు.. కాలేజీ విద్యార్థుల్లో కూడా ఇటువంటి ప్రయోజనాలుంటాయని తేలింది.
అందుకే పిల్లల్లో శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడేట్టుగా ప్రోత్సహించాలి. ప్రతి స్కూల్లోనూ చదువుకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో శారీరక వ్యాయామానికి ఉపయోగపడే క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యం ఇవ్వాలి. అప్పుడే పిల్లలు యంత్రాల్లా కాకుండా జీవంతో కూడిన చురుకైన వ్యక్తులుగా ఎదుగుతారని చెబుతున్నారు.