కథలో కీ రోల్‌ చేశా..

కథలో కీ రోల్‌ చేశా..‘స్పై’ సినిమాలో స్టైలిష్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్న హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌. అందుకు పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో ‘భజే వాయు వేగం’లో కనిపించనుంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. హ్యాపీ డేస్‌ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రను పోషించాడు. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 31న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌ మీడియాతో సంభాషించింది. ఈ సినిమాలో ఇందు అనే క్యారెక్టర్‌ చేశాను. ఆమె బ్యూటీషియన్‌. బ్యూటీషియన్‌ అంటే సహజంగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు వెంకట్‌. ఆయన పర్సెప్షన్‌లోనే సినిమా అంతా వెళ్తుంది. కథలో నేను కీలకమైన పాత్రగా ఉంటాను. వెంకట్‌ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అంతగా అతన్ని ఇష్టపడుతుంది. ఇదొక రా కంటెంట్‌ మూవీ. యాక్షన్‌, ఎమోషన్‌ ఆకట్టుకుంటాయి. ఇందులో ట్రెడిషనల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తా. చీరకట్టు లేదా ట్రెడిషనల్‌ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేయడం ఇష్టం ఎందుకంటే రియల్‌ లైఫ్‌లో కూడా ట్రెడిషనల్‌ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతుంటా. ‘స్పై’ సినిమాలో మోడరన్‌ డ్రెసెస్‌, స్టైలిష్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేశా. ఈ సినిమాలో నా పాత్ర ఆ క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ లాంటి పేరున్న సంస్థలో హీరోయిన్‌గా సినిమా చేయడం గర్వంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్‌ గెస్‌ సినిమా మీద క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. ప్రశాంత్‌ ప్రతిభని థియేటర్‌లో మీరంతా చూస్తారు.