– వేసవి సంగీత నృత్య శిక్షణా శిబిరాలు
– శృతి లయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆట, పాట జానపద భరతనాట్యం యోగలో శిక్షణ
– చిన్నారుల్లో వెల్లివిరుస్తున్న సృజనాత్మకత
నవతెలంగాణ-ఆమనగల్
మారుతున్న అలవాట్లు, పెరిగిన సాంకేతికత చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. టీవి సెల్ ఫోన్ లకు చిన్నతనం నుంచే బానిసలై మానసికంగా శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని శక్తివంతులుగా తయారు చేసేందుకు శృతి లయ కల్చరల్ అకాడమీ శక్తి వంచన లేకుండా కషి చేస్తుంది. ఆటలు పాటలు ఆచార వ్యవహారాలు జాతీయ గీతాలు జానపద గేయాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లెక్కలు స్పోకెన్ ఇంగ్లీష్‌పై పట్టు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. శృతి లయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని అయ్యసాగర్ క్షేత్రం, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, తెలకపల్లి మండల కేంద్రాల్లో వేసవి సంగీత నృత్య శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిలో అయ్యసాగర్ క్షేత్రం వద్ద రెసిడెన్షియల్ పద్ధతిలో (రేయింబవళ్ళు) ఉండగా ఇతర ప్రాంతాల్లో డేస్కాలర్ పద్ధతిలో 1300 మంది చిన్నారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ పొందుతున్నారు. శిబిరంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, తోటి వారికి సహాయపడటం, దేశంపై ప్రేమ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించడం, దేశ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు వాటి ప్రాముఖ్యత, నైతిక విలువలు పెంపొందించేలా నీతి కథలు, హ్యాండ్ రైటింగ్‌లో నైపుణ్యత, చిత్రలేఖనంలో మెలకువలు, శారీరక శక్తివంతులు చేయడానికి యోగ, సాంప్రదాయ నత్యం, కోలాటం, వివిధ రకాల ఆటల పోటీలు, జ్ఞాన శక్తిని పెంపొందించేందుకు శ్లోకాలు జాతీయ గీతాలు జానపద గేయాలు కంఠస్థం చేయిస్తున్నారు.
స్టేజీపై మాట్లాడే ధైర్యం వచ్చింది
నేను గత రెండు సంవత్సరాలుగా వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నాను. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. స్టేజీ ఫియర్ పోయి మాట్లాడే ధైర్యం వచ్చింది. ఒకప్పుడు లెక్కలు అంటే భయమేసేది ఇప్పుడు ఎం.ఎల్.ఏ లెవల్ టు కు ప్రమోట్ అయ్యాను. సంస్కృతి సంప్రదాయాలు, తల్లిదండ్రుల విలువలు, సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు కంఠస్థం, భరత నాట్యం, కరాటేలో శిక్షణ పొందాను. నాతో పాటు 220 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటివద్ద ఉన్నట్టే అన్ని రకాల వసతులతో శిక్షణ పొందుతున్నాము.
స్పందన (కేజీబీవీ ఆమనగల్) 10వ తరగతి మసిగొండపల్లి
అన్ని రకాల యోగా ఆసనాలు తేలికగా వేస్తాను
అన్ని రకాల యోగా ఆసనాలు తేలికగా వేస్తున్నాను. శిక్షణ శిబిరంలో ప్రతి రోజూ వివిధ రకాల ఆటలు, నీతి కథలు, డ్రాయింగ్, పెయింటింగ్ వేసేందుకు చిత్రలేఖనంలో మెళుకువలు నేర్పిస్తున్నారు. లెక్కలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్‌పౖౖె ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. భరత నాట్యం, కోలాటం, బాలసభ, ఎంఎంఎస్ ప్రాక్టీస్, నృత్యం, పాటలు, సామాజిక సేవా చిత్రాలు, స్వచ్ఛభారత్ తదితర అంశాలను నేర్పుతున్నారు.
శివాని (10వ తరగతి పూర్తి) తుర్కలపల్లి
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి గత 6 సంవత్సరాలుగా వేసవి నృత్య శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుత వేసవి కాలంలో ఏర్పాటు చేసిన 8 కేంద్రాలలో 1300 వందల మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. అంతరించిపోతున్న కళలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, లెక్కల్లో కనీస సామర్థ్యాలలో, నైతిక విలువలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 40 రోజుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఈనెల 29న ఆమనగల్ పట్టణ సమీపంలోని బీఎన్ ఆర్ గార్డెన్‌లో ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ అంశాలలో ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్టు చేస్తున్నాం.
దార్ల చిత్తరంజన్ దాస్ (శృతి లయ కల్చరల్ అకాడమీ చైర్మెన్)