– వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్
బెంగళూర్ : కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న యువ క్రికెటర్ రిషబ్ పంత్.. అంచనాలను మించి ఆరోగ్య పురోగతి సాధిస్తున్నట్టు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబర్‌లో ప్రమాదానికి గురైన పంత్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో పలు శస్త్రచిక్సితలు చేసుకున్నాడు. అనంతరం బెంగళూర్‌లోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. రిషబ్ పంత్ వైద్య బృందం ఊహించిన గడువుకు ముందే మంచిగా కోలుకుంటున్నాడు. సాధారణ కసరత్తులతో పాటు టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్‌ను రిషబ్ పంత్ క్రమంగా పాటిస్తున్నట్టు ఎన్‌సీఏ వర్గాల సమాచారం. కర్ర సాయం లేకుండానే నడుస్తున్న పంత్.. ఇటీవల మెట్లను సైతం అవలీలగా ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో పంత్ నుంచి నొప్పిపై ఎటువంటి ఫిర్యాదు లేదని.. ఉత్సాహంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘ విరామంలో పంత్‌తో యువ క్రికెటర్లకు సెషన్లు ఏర్పాటు చేస్తున్నాడు ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు సిద్ధమయ్యేలా రిషబ్ పంత్ రిహాబిలిటేషన్ ప్రణాళిక రూపొందించారు. ఇక శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో జశ్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ సైతం ఎన్‌సీఏకు చేరుకున్నారు. రిహాబిలిటేషన్‌లో భాగంగా బుమ్రా ఇప్పటికే తేలికపాటి బౌలింగ్ సాధన చేస్తుండగా.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సాధనకు సిద్ధమవుతున్నాడు. బుమ్రా, శ్రేయస్‌లు ఆసియా కప్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.