సర్వే ప్రశాంతంగా జరిగేలా సహకరించండి : బీసీ కమిషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని బీసీ కమిషన్‌ కోరింది. ఈ మేరకు శుక్రవారం బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నిరంజన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ కమిషన్‌ వద్ద తగినంత యంత్రాంగం లేని కారణంగా ప్లానింగ్‌ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని తెలిపారు.
ఈ సర్వేతో ఆయా రంగాల్లో బీసీల వెనుకబాటుతనం తెలుస్తుందనీ, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలు, సూచనలకు సర్వే సేకరించే సమాచారం కీలకంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం నమోదు చేసే వారిపై చట్టబద్ధమైన చర్యలుంటాయని హెచ్చరించింది.