మా బాబును ఆదుకోండి సారూ..

– పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న బాలుడు
– దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు
నవతెలంగాణ – బాలానగర్‌
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబంలో లేక లేక కలిగిన సంతానం.. పెండ్లైన తొమ్మిదేండ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతో సేపు నిలువలేదు. బాబు పుట్టుకతోనే అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తిప్పని ఆస్పత్రి లేదు. అందినకాడికి అప్పులు చేశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో దాతల సహాయాన్ని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన చిలుక నరేశ్‌, శ్యామల దంపతులకు 2022 ఆగస్టులో బాబు (ప్రణవాజ్‌) పుట్టాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించగా.. కాలేయం పనితీరు సరిగా లేదని వైద్యులు చెప్పారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో నాలుగు నెలల వయసులో బాబుకు శస్త్రచికిత్స చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. బాలుడి కడుపు ఉబ్బుతోంది. ద్రవ పదార్థాలు తప్ప.. ఘన పదార్థాలు తినలేడు. వాంతులు అవుతుంటాయి. రెండు సంవత్సరాల బాబును తీసుకుని హైదరాబాద్‌లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కాలేయ మార్పిడి చేయాలని, రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. తలకు మించిన భారమే అయినా ఇప్పటికే సుమారు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక దాతల సహాయాన్ని కోరుతు న్నారు. దాతలు ఎవరైనా బాలుడి తండ్రి నరేశ్‌ మొబైల్‌ నెంబర్‌ 70751 66566కు సంప్రదించాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.