ఎన్టీఆర్‌కు ప్రధాని మోడీ నివాళి

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ప్రధాని మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌ సినిమాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను పోషించి, కోట్లాది మంది మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. మోడీ ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ఆదివారం మాట్లాడారు.ప్రధాని మోడీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 101వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ సేవలను ప్రస్తావించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. గొప్ప నటనా కౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఆయన జీవం పోశారని తెలిపారు. రాజకీయాలతోపాటు సినీ రంగంలో గొప్ప ప్రతిభ చూపారన్నారు. బహుముఖ ప్రతిభతో ఆయన సినీ రంగంలో పేరు, ప్రతిష్ఠలు సంపాదించారని తెలిపారు. 300కుపైగా చిత్రాల్లో నటించి అలరించారని తెలిపారు. ‘యువ సంగమ్‌’లో పాల్గొన్న ఇద్దరు యువకులతో మోడీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. మొదటి విడత యువ సంగమ్‌లో సుమారు 1,200 మంది యువత 22 రాష్ట్రాల్లో పర్యటించారని మోడీ చెప్పారు. వీరంతా తమ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోయే మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు.
పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ ఎంపీల నివాళి
పార్లమెంట్‌లో నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ ఎంపీలు నివాళులర్పించారు. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌ పూల మాలలేసి నివాళులర్పించారు.