ఒక్కో స్కూల్‌కు రూ.2 కోట్లు
ఐదేళ్లల్లో పనులు పూర్తికి ప్లాన్
సంగారెడ్డి జిల్లాలో 25 స్కూళ్ల ఎంపిక
ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగద్ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 25 పాఠశాలలను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల జాబితాలను ఇటీవలే విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పీఎంశ్రీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపికైన పాఠశాలల్లో వివిద అభివృద్ధి పనులు చేపడతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఉంచేందుకు మన ఊరు-మన బడి పేరుతో అభివృద్ధి చేస్తుంది. కేంద్రం నుంచి కూడా కొన్ని పాఠశాలను అభివృద్ధి చేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత ఉన్నతంగా రూపుదిద్దుకోనున్నాయి.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలు ఉండేలా అభివృద్ధి పర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. పీఎంశ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఒక్కో పాఠశాలకు రూ.2 కోట్లు కేటాయించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున నిధులు కేటాయిస్తారు. రూ.2 కోట్లు ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేయాలి. ఏటా రూ.40 లక్షల నిధుల్ని కేటాయిస్తారు. ఈ నిధులతో పనులు చేసిన తర్వాత వచ్చే ఏడాదికి నిధులు ఇస్తారు. పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, వసతుల కల్పన, ఇతర సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ, ఎల్‌ఈడీ లైట్లు, పర్యావరణ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవనరులతో పాటు వృత్తివిద్య కోర్సులు, నైపుణాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 25 స్కూళ్ల ఎంపిక
పీఎంశ్రీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సంగారెడ్డి జిల్లాలో 25 పాఠశాలను ఎంపిక చేశారు. న్యాల్‌కల్ మండలంలోని కేజీబీవీ, పటాన్‌చెరు మండలంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, కొండాపూర్ మండలంలోని తొగర్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్, నాగిలిగిద్ద మండలంలోని మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్, పుల్కల్ మండలంలోని సింగూర్ సోషల్‌వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట జెడ్పీహెచ్‌ఎస్, తెల్గాపూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్, వట్‌పల్లి మండలంలోని పోతులబోగుడ టీఎస్‌ఎంఎస్, సదాశివపేట మండలంలోని నందికంది జెడ్పీహెచ్‌ఎస్, అందోల్ మండలంలోని తాడ్మనూర్ ఎంపీపీఎస్, సోషల్‌వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్, హత్నూర మండంలోని దౌల్తాబాద్ జెడ్పీహెచ్‌ఎస్, జిన్నారం మండంలోని టీడబ్యూఆర్‌ఈఐఎస్, కంది మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కోహీర్ మండలంలోని దిగ్యాల్ టీఎస్‌ఆర్‌ఈఐఎస్, మనూరు మండలంలోని మాయికోడ్ ఎంపీయూపీఎస్, మునిపల్లి మండలంలోని లింగంపల్లి టీఎస్‌ఆర్‌ఈఐఎస్, నారాయణఖేడ్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్, రాయికోడ్ మండంలోని టీఎస్‌డబ్యూఆర్‌ఈఐఎస్‌జి, సిర్గాపూర్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్, జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, టీఎస్‌డబ్యూఆర్‌ఈఐఎస్ జి, బొల్లారం జెడ్పీహెచ్‌ఎస్, గుమ్మడిదల జెడ్పీహెచ్‌ఎస్, ఝరాసంగం టీఎస్‌ఎంఎస్ పాఠశాలలను ఎంపిక చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి
ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన ఊరు-మన బడి పథకం కింది అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు దశల వారిగా నిధులు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద ఐదేళ్లకు కలిపి ఒక్కొ పాఠశాలకు రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ