పీఎంఎఫ్‌బీవై గరిష్టస్థాయికి

పీఎంఎఫ్‌బీవై గరిష్టస్థాయికి–  2021-22తో పోలిస్తే కొత్తగా రుణం పొందిన ప్రాంతం 70 శాతం ఎక్కువ : కేంద్రం గణాంకాలు
న్యూఢిల్లీ : ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రుణం పొందని రైతుల బీమా చేయబడిన స్థూల పంట విస్తీర్ణం కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఇది కేంద్రం పంట బీమా పథకానికి పెరుగుతున్న అంగీకారాన్ని సూచిస్తున్నదని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. రుణాలు పొందని ప్రాంతం (అంటే రైతులు బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి రుణం తీసుకోని స్థూల పంట ప్రాంతం)పీఎంఎఫ్‌బీవై కింద 2022-23 పంట సంవత్సరంలో 180 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది 2021-22లో 106 లక్షల హెక్టార్లతో పోలిస్తే 70 శాతం ఎక్కువ. వాస్తవానికి 2022-23లో పీఎంఎఫ్‌బీవై కింద మొత్తం బీమా చేయబడిన ప్రాంతంలో బీమా చేయబడిన రుణాలు పొందని ప్రాంతం 36.07 శాతంగా ఉన్నది. ఇది గత ఐదేండ్లలో అత్యధికం. పీఎంఎఫ్‌బీవై కింద మొత్తం బీమా చేయబడిన ప్రాంతంలో రుణం పొందని ప్రాంతం నిష్పత్తి గత ఐదేండ్లలో దాదాపు 24 శాతంగా ఉన్నది. 2021-22లో ఇది 23.93 శాతం, 2020-21లో 24.52 శాతం, 2019-20లో 22.38 శాతం, 2018-19లో 24.3 శాతంగా ఉన్నది.
గత ఐదేండ్లలో బీమా చేయబడిన రుణం పొందని ప్రాంతం పెరగగా.. 2019-20లో 444 లక్షల హెక్టార్ల నుంచి రుణగ్రహీత ప్రాంతం 2020-21లో 354కు, 2021-22లో 336 లక్షల హెక్టార్లకు, 2022-23లో 320 లక్షల హెక్టార్లకు తగ్గుతూ వచ్చింది. 2018-19లో రుణగ్రహీత ప్రాంతం 406 లక్షల హెక్టార్లుగా ఉన్నది.