భారత ఆర్మీ పట్ల పీఎన్‌బీ నిబద్ధత

PNB's commitment to the Indian Army– నామినీకి రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ చెక్‌ అందజేత
హైదరాబాద్‌ : భారత ఆర్మీ, వారి కుటుంబాలకు బాసటగా నిలిచే విషయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) తన నిబద్ధతను చాటింది. రూ.50 లక్షల పీఎన్‌బీ రక్షక్‌ ప్లస్‌ ఇన్సూరెన్స్‌ చెక్‌ను భారత ఆర్మీకి చెందిన దివంగత రిటైర్డ్‌ సుబేదార్‌ ముకేశ్‌ కుమార్‌ భార్య కమళావతి దేవికి అందించింది. హైదరాబాద్‌ జోన్‌లోని పీఎన్‌బీ లాల్‌బజార్‌ శాఖ వినియోగదారుగా ఉన్న ముకేశ్‌ కుమార్‌ ఇటీవల ఒక రైలు ప్రమాదంలో మరణించారు. డిప్యూటీ జోనల్‌ హెడ్‌ సంజరు మానె, సికింద్రాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ సుజీత్‌ కుమార్‌ ఝా లు ఈ చెక్‌ను నామినీగా ఉన్న ముకేశ్‌ భార్యకు ఒక కార్యక్రమంలో అందజేశారు. బాధిత కుటుంబానికి సంజరు మానె.. సానుభూతి ప్రకటించారు. సాయుధ బలగాల త్యాగాల పట్ల బ్యాంకు నిబద్ధతను ఆయన వివరించారు. ‘పీఎన్‌బీ రక్షక్‌ ప్లస్‌’ను అందించటం పట్ల పీఎన్‌బీ గర్వంగా ఉన్నదనీ, సోల్జర్లు, పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం రూపొందించిన ఒక అసాధారణ పథకమని అన్నారు. ఈ బాధా సమయంలో ముకేశ్‌ కుటుంబానికి పీఎన్‌బీ మద్దతుగా ఉంటుందని సుజీత్‌ కుమార్‌ ఝా ఈ కార్యక్రమంలో తెలిపారు. ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్‌ కవర్‌ను తీసుకోవాలని సూచించారు. కష్టకాలంలో మద్దతుగా నిలిచిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు కమళావతి దేవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినియోగదారులు, ఆర్మీ అకౌంట్‌ హోల్డర్లకు బ్రాంచ్‌ మేనేజర్‌ ధన్యవాదాలు చెప్పారు. గవర్నమెంట్‌ బిజినెస్‌ వర్టికల్‌, హైదరాబాద్‌(సికింద్రాబాద్‌) హెడ్‌ రేఖా రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.