– 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ
– ఏప్రిల్ 1న కవిత బెయిల్‌పై విచారణ
– ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులు బీజేపీలో చేరారు… కడిగిన ముత్యంలా బయటకు వస్తా: కవిత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను తీహార్ జైలు తరలించారు. సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈడీ కస్టడీలో ఉన్న కవితకు రోజువారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గతంలో ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోసెబ్ హుస్సేన్, కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు కొనసాగించారు. తొలుత ఈడీ తరపు వాదనలు కొనసాగిస్తూ… కవితను 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కవిత కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించారు. అలాగే కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఈ కేసులో పలువురిని ఇంకా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఈ వాదనలపై కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి, రానా అభ్యంతరం వ్యక్తం చేశారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. పీఎంఎల్‌ఎ చట్టంలోని సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన కవిత స్టేట్మెంట్స్‌ను ప్రిజర్వ్ చేయాలని కోరారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న ఈడీ తరపు న్యాయవాది కవిత బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కోరారు. మరోసారి విక్రమ్ చౌదరి వాదనలు కొనసాగిస్తూ… కవిత 16 ఏండ్ల కొడుకుకు 11వ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజైందని కోర్టుకు నివేదించారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలు జరుగుతోన్న నేపథ్యంలో…. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 16 వరకు కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, దాదాపు 12 ఇరువైపు వాదనలు ముగుస్తున్నట్లు పేర్కొన్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా… కవిత జ్యూడిషియల్ కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును అరగంటకు రిజర్వ్ చేశారు. దీంతో కోర్టు హాల్‌లోనే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని, ఆమె తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో న్యాయమూర్తి అనుమతించారు. ఈ సందర్భంగా భర్త అనిల్, కుటుంబ సభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర పార్టీ నేతలు ఆమెతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఒంటిగంటకు వెలువరించిన తీర్పులో కవితకు 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ఉదయం తిరిగి కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్‌పై ఏప్రిల్ 1 మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆమెను తీహార్ జైల్ కు తరలించారు.
పోలీస్ వ్యాన్‌లో తీహార్ జైల్ కు కవిత
కోర్టు 14 రోజులు కస్టడీ విధించడంతో కవితను పోలీస్ వ్యాన్‌లో తీహార్ జైల్‌కు తరలించారు. మధ్యాహ్నం 1 గంటకు కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం రౌస్ అవెన్యూలోని కోర్టు హాల్ నుంచి ఆమెను అదే బిల్డింగ్‌లోని లాకప్ రూంకు తరలించారు. తర్వాత ఈడీ అధికారులు కవితను పోలీసులకు అప్పగించారు. లాకప్ రూంలోనే వైద్య సిబ్బంది కవితకు బీపీ, షుగర్ లెవల్స్‌ను చెక్ చేశారు. దాదాపు నాలుగు గంటల తర్వాత… సాయంత్రం 4:54కు ఆమెను పోలీస్ వ్యాన్‌లో జైల్‌కు తరలించారు. అయితే ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురుకాకుండా… తొలుత లాకప్ రూంలోకే పోలీస్ వ్యాన్‌ను తీసుకెళ్లారు. ఆమెను లోపలే వ్యాన్‌లోకి ఎక్కించుకొని నేరుగా జైల్‌కు తీసుకెళ్లారు. కాగా కవితను జైల్‌కు తరలించే వరకు ఆమె భర్త అనిల్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ ఇతర నేతలు, కవిత అభిమానులు లాకప్ రూం ముందే పడిగాపులు కాశారు.
ఈడీ ముందుకు శరణ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా తెరపైకి వచ్చిన కవిత మేనల్లుడు మేక శ్రీ శరణ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించి జరిగిన నగదు బదిలీ/ వినియోగం నేర ప్రక్రియలో మేక శరణ్ ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేర ప్రక్రియ సమాచారం శరణ్ దగ్గర ఉందని, ఆయన కేసు దర్యాప్తునకు సహకరించడంపై ఈడీ ఇటీవల కోర్టుకు తెలిపింది. కవిత తరపున సౌత్ గ్రూప్ నుంచి నగదు లావాదేవీలు/వినియోగం, బదిలీలు వంటి కీలక వ్యవహారాలన్నీ మేక కనుసన్నల్లో జరిగాయని ఆరోపించింది. ఈ నెల 15న కవిత ఇంట్లో నిర్వహించిన సోదాల టైంలో మేక శరణ్ ఫోన్‌ను సీజ్ చేశామని, అలాగే పీఎంఎల్ ఏ సెక్షన్ 17 ప్రకారం… శనివారం (మార్చి 23) శరణ్ ఇంట్లో సోదాలు చేపట్టామని, ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని రెండుసార్లు ఆదేశించినా ఆయన రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే… తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శరణ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఒకవైపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈడీ అధికారులు…మరోవైపు ఈడీ ప్రధాన కార్యాలయంలో శరణ్‌ను విచారించారు. ముఖ్యంగా లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ఆమె ఆదేశాలను సారంగా సాగిన నగదు బదిలీలు/వినియోగం, సమీర్ మహేంద్రుతో శరణ్ చేసిన సంబంధాలు వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది.
జైల్లో ఆభరణాలు ధరించేందుకు కవితకు అనుమతి
తీహార్ జైళ్లో కవిత ఆభరణాలు ధరించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులు సీబీఐ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఇందులో కవిత పెట్టుకున్న పలు విజ్ఞప్తులను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమె పెట్టుకున్న ఆరు విజ్ఞప్తులను అంగీకరిస్తూ… రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీహార్ జైల్ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే కవిత పడుకోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటితో పాటు పెన్ను, పేపర్లు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత వైద్య రికార్డ్‌లను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 నాటికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. మద్యం కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ.. అడ్జ్యూడికెటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్‌లో కవిత న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈడీ సీల్డ్ కవర్‌లో ఇచ్చిన ఈ రికార్డులను ”కాన్ఫిడెన్షియల్” గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు కోర్టు సూచించింది.
సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం
కవిత ప్రధాన కుట్రదారు, లబ్దిదారురాలని ఈడీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కాం కు పాల్పడ్డారని పేర్కొంది. ఇందులో రూ. 100 కోట్లు హవాలా రూపంలో చేతులు మారాయని తెలిపింది. అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 19 ప్రకారం ఈ నెల 15 న ఆమెను అరెస్ట్ చేసినట్లు వివరించింది. ఒకవేళ కవితను రిలీజ్ చేస్తే లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఆటంకాలు సష్టించవచ్చని ఈడీ ఆరోపించింది. కవిత అత్యంత ప్రభావశీలి అయినందున సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. సాధారణ నేరాలతో పోల్చితే ఆర్థిక నేరాలు మరింత క్లిష్టతరంగా ఉంటాయని తెలిపింది. ఇందులో ప్రమేయం ఉన్న నేరస్థులు… సమాజంలో చాలా ప్రభావవంతంగా ఉండి, నేరాలను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేస్తారని ఆరోపించింది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఆమెకు బెయిల్ నిరాకరించాలని కోరింది. ఈ స్కాంలో ఇంకా ఎవరెవరు భాగస్వామ్యులైౖ ఉన్నారో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఎన్నికల్లో లబ్దికోసమే బీజేపీ కుట్ర…: బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు
కవిత అరెస్ట్ తో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ చేస్తోన్న కుట్రలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నిరపరాధిగా కవిత బయటకు వస్తారని చెప్పారు. కవితను జైలుకు తరలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వాటికి కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడదన్నారు. ఉద్యమ పార్టీకి ఇవన్నీ కొత్త కాదని, రాష్ట్ర పోరాటంలో అరెస్టై జైల్‌కు వెళ్లిన చరిత్ర ఉందన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులు బీజేపీలో చేరుతున్నారు : కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత అన్నారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చు కానీ, తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో కోర్టు హాల్ ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ మొదలుపెట్టారు. ‘ఇది మనీలాండరింగ్ కేసు కాదు. పూర్తిగా పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇది నకిలీ, తప్పుడు కేసు. ఇందులో నుంచి త్వరలోనే బయటకు వస్తా’ అని అన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారన్నారు. రెండో నిందితుడు బీజేపీి నుంచి టికెట్ పొందబోతున్నారన్నారు. మూడో ముద్దాయి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ. 50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ కేసుతో తమకే సంబంధం లేదని, అందువల్ల ఈ కేసు నుంచి తాము బయటకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు.