ప్రాచీన కవిత్వం సంకెళ్లు తెంపిన
గండ్రగొడ్డలై గర్జించాడు
నవకవితకు తొలి వేకువై కలం
విదిల్చిన గళం తానే అయ్యాడు
ఆకాశాన విహరిస్తున్న కవితా కన్యను
దివి నుండి భువికి దింపి
దీనుల హీనుల ఆకలికేకలు
విని తరించమన్నాడు!
యమాతారాజభానస బానిసత్వం
రద్దుచేసి ఛాందస ఛందస్సుకు
చెలియలి కట్టేసి..
పతితుల భ్రష్టుల బాధాసర్పద్రష్టుల
ఆకలి ఆవేదనల కవితా మంత్రం
జగమంతా వినేలా కోడై కూసాడు
సంకుచిత భావాల మళ్లు తెగ్గొట్టి
అనంత భావజలధిని
సమస్త శ్రామిక కవితా సేద్యానికి
జలజలా ప్రవహింపజేశాడు!
మానవత్వమే కవిత్వమన్న తత్వాన్ని
సలసలా మరిగే తన భావాల కొలిమిలోంచి
పాఠకుల మెదళ్లలో భగభగా వొంపుతూ
ధ్వంస జీవితాల ఆకలి పేగులతో
నవకవన రుద్రవీణ మోగించి పండిత
పామరుల్ని ప్రభావితుల్ని చేసాడు!
కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల..
కాదేదీ కవిత కనర్హమంటూ ప్రతీ
పాఠకుణ్ణి తన్ను మించిన కవిగా
మల్చేంత ప్రేరణ అవుతూ మరో ప్రపంచం పిలిచిందంటూ
నవయుగాన్నే పలవరిస్తూ
మహాప్రస్థానం వైపు సాగిపోయాడు..!!
(నేడు శ్రీశ్రీ వర్ధంతి)
– భీమవరపు పురుషోత్తమ్
సెల్ : 9949800253