పద్య సాహిత్యం సమాజానికి ఎంతో అవసరం అని అవధాని, పద్యసారస్వత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అవుసుల భానుప్రకాష్ అన్నారు. అవుసుల భానుప్రకాష్ రచించిన ట్రెండింగ్ పద్యాలు పుస్తక పరిచయ సభ వ్యాస మహర్షి యోగా సెంటర్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల నుంచి యువత, వృద్ధుల వరకు చదివే పుస్తకం ట్రెండింగ్ పద్యాలు అని అన్నారు. సమాజానికి పద్య సాహిత్యం ఎంతో అవసరామని, పద్యం ద్వారానే చిన్ననాటి బాలలు నీతి, నిజాయితీ, న్యాయం నేర్చుకుంటారని అన్నారు. కవి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా సాహిత్య రచనలు ఉండాలన్నారు. కవి కొమురవెల్లి అంజయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రచనలు రావాలని, అందుకు ట్రెండింగ్ పద్యాలు దోహదపడతాయని అన్నారు. మరో కవి గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ పద్యం అంటే ప్రాచీనమైనది, గ్రాంథికమైనదికాదని, ఆధునికత కలిగి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, సింగీతం నరసింహారావు, సరస్వతి రామశర్మ, బస్వ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడారు.