కక్కెర్ల దయాకర్‌కు ఈ ‘నానీల కమ్మలు’ అంకితం చేశారు కవి భాస్కర్. ఈ పుస్తకానికి నానీ సృష్టికర్త ఆచార్య డా|| ఎన్.గోపీ, డా|| ఎస్.రఘు, డా|| చింతం ప్రవీణ్ కుమార్, నేతల స్వామిగారలు చక్కటి ముందు మాటలు రాశారు. డా|| గోపిగారు నానీలు సృజించి 25 సంవత్సరాలు దాటింది. ఈ ప్రక్రియలతో 520 నానీ సంపుటాలు వెలువడ్డాయి. పుస్తకంలో రాక విడిగా రాసిన వారు ఓ వెయ్యిమంది వుంటారు. తెలుగు సాహిత్యంలో ఇది పెద్ద సంచలనం, ఓ రికార్డ్. మడత భాస్కర్ గతంలో ‘పైసల చెట్టు, అక్షరాల సభ’ లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. ఉపాధ్యాయ వృత్తిలో వున్నా చక్కటి, చిక్కటి కవిత్వం రాసే భాస్కర్ కవిత్వంలోని కొన్ని మంచి నానీల కమ్మలు చూద్దాం.
ఎక్స్పైరీ డేట్‌లేని/ ఏకైక ఔషధం/ పుస్తకం/ మాది ఔషధాలయం (పేజీ 26) అంటారు కవి. బడిని ఔషధాలయం అని అనడంలో విద్యా ప్రాధాన్యం ఈ నానీలో చెప్పారు. పద్మశ్రీ మాటేమో గాని/ పద్యశ్రీ ఐనా/ ఇవ్వాల్సిందే/ తెలుగు పండితుడికి (పేజీ 49) అంటారు. చాలా కవితలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలలపైనే వున్నాయి. రైతు దేశమైన భాఆరతదేశంలో దేశ రాజధానిలో నాగళ్లు చేబూని వీరోచితంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడి ప్రధాని చేసిన చట్టాన్ని వెనక్కి కొట్టించారు. రైతుపోరుపై కవి చక్కటి నానీ రాశారు.
”భూమాత/ రోమాంచితమైంది/ రైతన్న ధర్నాశోకం/ వినిపిస్తుంటే” (పేజీ 122) అంటారు. మేధావీ! నీలో రగిలే విద్వత్తు/ వేల జీవితాలను వెలిగించే విద్యుత్తు (పేజీ 132)… ఇలాంటి నానీలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి.
వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను నానీలో కవిత్వీకరించడం విశేషం. ఈ నానీ ఆసక్తికరంగా వుంది (పేజీ 107). ”మీ విడాకులు మీరు తీసుకున్నారు/ మా గిఫ్టులు/ మాకు ఇచ్చేయండి” అంటారు. అలాగే ప్రకృతిని ప్రతి కవీ ఏదో సందర్భంలో వర్ణిస్తాడు. ఈ కవి ఒక నానీలో ఇలా వ్యాఖ్యానిస్తారు.. ”సూర్యుడు/ మబ్బురంగుకోటు/ వేసుకొస్తున్నాడు/ చలికి తటుటకోలేక (పేజీ 90)” అంటారు. దాదాపు 300కి పైగా కేవలం 4 లైన్లలో అర్థవంతమైన కవిత్వం ప్రతి నానీలో కనిపిస్తుంది. మీరూ ఆస్వాదించండి..
– తంగిరాల చక్రవర్తి.