గురుచరణ్ సినిమా పాటల్లో కవితాభివ్యక్తి

కవిగా, సినీగేయరచయితగా ప్రసిద్ధులైన గురుచరణ్ 21 ఏప్రిల్ 1948వ సంవత్సరం విజయవాడ సమీపంలోని హనుమాన్ జంక్షన్ లో జన్మించారు. తల్లి యం.ఆర్. తిలకం అనగా మానపురం రామ తిలకం. తండ్రి మానపురం అప్పారావు. 5వ తరగతి వరకు హనుమాన్ జంక్షన్ లోనే చదివారు. మూడు క్లాసులు మద్రాసులో చదివారు. బి.ఎస్సీ వరకు అనకాపల్లిలో, యం.ఏ. తెలుగు ఆంధ్ర యూనివర్సిటిలో పూర్తి చేశారు. మొదట ఆత్రేయ వద్ద శిష్యునిగా చేరిన గురుచరణ్ ఆయన దగ్గర ఎన్నో సాహిత్య మెళకువలను నేర్చుకున్నారు. రాజ్ – కోటి ల ప్రోత్సాహంతో ముందుకు సాగినారు. నిజానికి గురుచరణ్ ముందు పేరు మానపురం రాజేంద్రప్రసాద్.. ఆత్రేయ వద్ద ఉన్నప్పుడు ‘ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగైంది’. అంటూ ఓ పల్లవి రాశారు. దానికి చరణాలు ఆత్రేయ రాశారు. అందుకు గాను రాజేంద్ర ప్రసాద్ పల్లవికి గురువు రాసిన చరణాల ద్వారా అప్పటినుంచి అతను గురుచరణ్ గా పేరు మార్చుకున్నారు. గురుచరణ్ తండ్రి సినీదర్శకులు కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తల్లి కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
ఇలా ఇంటిలోనే సినీకళాకారులుండడం, చిన్నప్పటి నుంచి సాహిత్యాభిలాష ఉన్నవాడు కాబట్టి ఆత్రేయ ప్రోద్బలంతో గురుచరణ్ పాటల ప్రస్థానం వైపు అడుగులు పడ్డాయి. గురుచరణ్ మొదటగా ఇంద్రధనస్సు సినిమాకు పాట రాశారు. ఆ పాట ఇదే.. ‘నవరస భరితం నాట్యమని అభినయ వేదం భరతమని చాటినవి ప్రతి భంగిమతో ఇలలో…. అనే పాటలో కథానాయిక నవరసభరితమైన నాట్యాన్ని చూసి ముగ్ధుడైపోయిన కథానాయకుడు ఆనందానుభూతితో పాడే పాట ఇది. నాట్యకళావేదాన్ని కొనియాడుతూ దానిని కథానాయిక నృత్యానికి అన్వయిస్తూ అత్యంత సహజ సుందరంగా పాటను రచియిస్తాడు. పాటలోని పదాలు, భావాలు సౌందర్యవంతమై ఔరా అనిపించేలా ఉండడం విశేషం. ఆత్రేయ శిష్యుడా మజాకా అన్నట్టుగా తన మొదటిపాటతోనే అందరిచేత ప్రశంసలందుకున్నాడు.
అలాగే
‘పుణ్యభూమి నాదేశం’ సినిమాలోని..
‘భరత దేశమా ఓ విషాదమా!
మతే లేని మతాలు మసి చేసినా నిలయమా మాతృ దేశమా మన్నించుమా’. అనే పాటలో గురుచరణకి ఉన్న దేశభక్తిని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
భారతదేశం అంటే బంగారు భూమి అని, వేదాలకు నిలయమని, సౌభాగ్యవంతమైనదని చరిత్రకారులు ఎంతో వర్ణించారు. అలాంటి దేశం ఇప్పుడు రౌడీలకు నిలయమై మారణాయుధాలతో బీభత్సం సృష్టిస్తూ విశాదంగా మారి మసిబారుతుంది. అందుకే భారతదేశం ఓ విషాదమా మతే లేనిమతాలు మసి చేసిన నిలయమా అంటే మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకుంటున్నాము. అందువలన మాతృదేశమా! మన్నించుమా! అంటూ గాంధీ గారు కూడా తనను చంపిన వాళ్ళను మన్నించమనే కోరాడు. రౌడీలను క్షమించమని అంటూ విషాద భరితమైన సన్నివేశాన్ని కరుణ రసం చిందేలా కన్నీళ్ళతో రాశాడు. భారతదేశాన్ని తల్లిగా భావించిన ఒకబిడ్డ తన సోదరులైన రౌడీలను మన్నించమన్నాడు. ఇదే ఎంతో దౌర్భాగ్యస్థితియో కదా అనే భావన ఈ పాటలో కనబడుతుంది.. “పుణ్యభూమి నాదేశం” సినిమాలో మరో ప్రణయగీతంలో..
‘తూర్పులోన కుంకుమ పరిచే సూర్యుడు నీవేనులే’ అని ప్రేయసి అంటే దానికి బదులుగా ‘మమతలే కలబోసుకున్న కమలమే నీవు’ అంటాడు కథానాయకుడైన ప్రియుడు. ఇది హిందీ చిత్రం. క్రాంతి వీరుకు తెలుగులో పుణ్యభూమి నాదేశం అని పేరు పెట్టబడింది. ఇందులో మోహన్ బాబు హీరో తానుగా ఎవరిని కాపాడడు. వారికి కావలసిన మనోధైర్యాన్ని ఇచ్చి పరోక్షంగా వాళ్ళకు కలిగిన కష్టాన్ని ఎదిరించే శక్తినిస్తాడు. కనుక ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తనను తాను ఆతర పాత్రలని ఉత్తేజాన్ని కలిగించడమే సూర్యుని యొక్క లక్షణం. ఆ విధంగానే ఈ చిత్రంలో హీరో పాత్రికేయురాలను ఎవరికి వారు స్వయం సిద్ధంగా కాపాడుకునేలా ధైర్యాన్ని కల్గిస్తాడు. అందుకే అన కుంకుమ పరిచే సూర్యుడు నీవెనులే’ అంటుంది. దానికి బదులుగా మమతలే కలబోసుకున్న కమలమే అతన్ని ప్రేమించి సూర్యుడేలా గెర్తించి ఈ పాటలో నీవు అని అతడంటాడు. సూర్యుడు లాంటి తీక్షణమైన వీక్షణం కల్గిన వాళ్ళను ప్రేమించే వారు. అరుదుగా ఉంటారు. అందులో జర్నలిస్టు అయిన హీరోయిన్ కమలము లాంటిది కావడం వల్లేలే సూర్యున్ని ఎరికోరి ప్రేమించింది. చిత్రంలోని ఓ తీవ్రవాదిని చాలా మెత్తని మనస్సు కల్గిన అమ్మాయి ప్రేమించిందని కవి వర్ణించాడు.
నటుడు మోహన్ బాబుకు వారి ఇంట్లో ట్యూషన్ మాస్టర్గా ఉంటున్న గురుచరణ్ పాటలు రాయిస్తే బాగుంటుందని ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అలా మోహన్ బాబు కొరిక మేరకు స్వేచ్ఛాభావగీతంగా ఈ పాట రాశాడు.. .అదే.. అల్లుడుగారు సినిమాలోని ఈ పాట..
‘ముద్ద బంతి పువ్వులో మూగబాసలు
మూసి వున్న రెప్పలపై ప్రేమ లేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా..
మధుమాసమే అవుతుంది అన్ని వేళలా..’
ఇందులో కథానాయక మూగది. ఆవిడ ముద్దబంతి లాంటిది. ఆమె మూగదని తెలియని స్త్రీలో ఆమెను, వెంబడించి మాట్లాడమనేవాడు. చివరకు తప్పని పరిస్థితుల్లో తను మూగదానినని సైగ చేసి చెప్పింది. ఇక పెళ్లి చేసుకోడని వెళ్ళిపోయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోలీసు కుమార్తె అయిన ఆమెను తను ప్రేమిస్తున్నాని ఆమె తండ్రితో చెప్తాడు. ఆ పోలీసు అధికారి వచ్వి నువు ఎందుకంత బాధపడతావు.. నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లాడడానికి అభ్యంతరం లేదని తను మాకు ఎప్పుడో సైగ చేసి చెప్పింది. అని అంటాడు. అందుకే ముద్దబంతి నవ్వులాంటి ఆమె నంగా బాస చేసిందని, తన కనురెప్పలతో ప్రేమలేఖలు రాసి తన ప్రేమను చెప్పకనే చెప్పినదని ఈ పాటలో వివరిస్తాడు గురుచరణ్.. చదివే మనసుంటే అన్ని వేళలా మధుమాసమే అవుతుందనడం గొప్ప భావన..
‘రంభాపురంలో అంబారి మీద కూకోరా! ఎత్తు ఉంది మెత్త ఉంది చూసుకోరా! ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాచుకోవే’
అనే పాట శృంగారభావనలతో అద్భుతంగా సాగుతుంది.. ద్వంద్వార్థాలతో సాగే పాట ఇది. ఇలాంటి పదబంధాలు, భావనలు పలికించడం సినీకవికి తప్పనిపని అని చెప్పడానికి బ్రహ్మ సినిమాలోని ఈ పాటే ఒక మచ్చుతునక.

కని అలాగే రౌడీగారి పెళ్ళాం’ సినిమాలోని..
‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా…
గుండె కోతకోసినా చేసినావు ఊయలా..’

ఒక దుర్మార్గుడైన రౌడి కేవలం వేయి రూపాయల కోసం పెళ్ళికాబోతున్న అమ్మాయిని చెంచాడు.. అందువల్ల బోయవాని వేటుకు గాయపడిన కోయిల అని ఆ అమ్మాయి పరిస్థితిని వర్ణిస్తూ గుండెకోత కోసినప్పటికీ, అమ్మాయి హృదయానికి బాధకలిగించినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం అనే ఇతని ఇంటిలోనే ఊయల వేసింది. అంటే అతనికే భార్య అవడానికి నిశ్చయించుకొని అతడిని
మంచితనంతో సాధించి పెళ్ళాం అయింది. కనుక ఆ రౌడీ గారి పెళ్ళాన్ని కవి బోయవాని వేటకు గాయపడిన కోయిల అన్నాడు. ఇక్కడ కరుణ రసం ఎంతో అద్భుతంగా పడింది. అలాగే ఖైదీగారు సినిమాలోని ఈ పాటను పరిశీలిద్దాం.
‘దేవతలారా దీవించండి చేసిన తప్పులు మన్నించండి జరిగేను ఎంతో ఘోరము తగిలెను దాని శాపము’
కథానాయకుడు తాను చేసిన తప్పును గుర్తుచేసుకుంటూ బాధతో పాడే పాట ఇది. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఒక మంచిమనిషి చావుకారణమైనాననే బాధతో ఈ పాటను పాడతాడు కథానాయకుడు. చేసిన తప్పుకు అతడు పడే పశ్చాత్తాపగుణం ఇందులో కనిపిస్తుంది.
అలాగే ‘జోకర్’ సినిమాలో.. పసిపాపను బుజ్జగిస్తూ పాడే ఈ పాట కూడా గురుచరణ్ ఉన్న లాలిత్యమైన హృదయాన్ని ఆవిష్కరిస్తుంది..

‘పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
అమ్మా అమ్మా పూలరెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా’ అంటూ పసిపాప ఆడుకునే బొమ్మనై ఆమెను లాలిస్తాననడం చాలా బాగుంది. ఇవే కాకుండా, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్, డిటెక్టివ్ నారద, సూర్యం, బ్రహ్మరుద్రుడు, రౌడీ జమిందారు, ఘరానా కూలీ, రాజా చిన్ని రోజా లాంటి దాదాపు 250 సినిమాలకు 500 పాటలను రాశారు. ఇంకా ఎన్నో సినిమాలకు డబ్బింగ్ పాటలను కూడా రాశారు. ఇలా లాలిత్యమైన పాటలు రాసిన గురుచరణ్ నేటికీ తన పాటల ప్రస్థానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
తెలంగాణ సాహితి ప్రచురించిన ‘సినీగీతావరణం’ లో ప్రచురితం

                                                                               – డా॥ పొన్నాల ఉపేందర్, యు.పి.జి.సి, మహబూబాబాద్