కవిత్వం – జీవితం ఒక్కటిగా

poetry -
the life
as oneకవన తత్వం – జీవన తత్వం రెండూ వేర్వేరుగా ఉండరాదని విస్పష్టంగా ప్రకటించినవాడు జాషువా. కనుకనే నవయుగ కవితా చక్రవర్తిగా శోభిల్లాడు.
‘నివశించుటకు చిన్న నిలయ మొకటి దక్క / గడన సేయుట కనబడను నేను / ఆలుబిడ్డలకు నై ఆస్తిపాస్తులుకూర్ప / పెడితోవలో పాదమిడను నేను / నేనాచరించని నీతులు బోధించి / రాని రాగము తీయలేను నేను / సంసార యాత్రకు చాలినంతకు మించి / గ్రుడ్డి గవ్వను కోరుకొనను నేను.’
ప్రజల కోసం ఏ రంగంలోనైనా పనిచేసే (రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సేవా) స్వచ్ఛంద కార్యకర్తలకు పై పంక్తులు ఎప్పటికైనా శిరోధార్యమే. వర్తమాన పెట్టుబడిదారీ వినిమయ సంస్కృతి విలాసాలకు ఆడంబరాలకు కొట్టుకుపోయే వారిని ఈ మాటలు కొంతలో కొంత స్పీడ్‌ బ్రేకర్స్‌లా నిలుపుదల చేస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అదే సందర్భంలో ఏ నిబద్దతకూ కట్టుబడక అడ్డదిడ్డంగా రాస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారికి చెంపపెట్టుకూడా.
నేను రాస్తున్నదేంటి? చెపుతున్నదేంటి? చేస్తున్నదేంటి? ఏమైనా సంబంధం ఉన్నదా? నా నిజాయితీ ఎంత? అని ఆత్మపరిశీలన చేసుకోవడానికి జాషువా మనముందు నిలువుటద్దంలా నిలుస్తాడు. అక్కడితో ఆగడు. ‘కుల మతాలు గీసుకున్న గీతల చొచ్చి / పంజరాన కట్టుబడను నేను / నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు / తరుగులేదు విశ్వనరుడు నేను’ అని గొంతెత్తి నినదిస్తాడు. ఒక పాదం భూమిపై ఉంచి, మరోపాదాన్ని విశ్వంలోకి జొప్పించే అపర వామనుడులా ఆవిష్కృతమవుతాడు. ఇక భౌతిక ప్రపంచాన కవిగా ఆక్రమించడానికి ఏం ఉంటుంది? దృఢ విశ్వాసము, దృఢ నిశ్చయము ఏర్పడ్డాక భయం ఉండదిక. తరుగే కాదు తిరుగులేదు ఆ కవికి అంటాడు ఆరుద్ర. పైకి ఒక వాస్తవ ప్రపంచం అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. కాని కవి తన ఎక్స్‌రే కళ్ళతో అంతర్గత సత్యాన్ని శోధించి విశదపరచాలి.
‘వాని రెక్కల కష్టంబులేని వాడు / సస్యరమ పండి పులకింప సంశయించు /వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు, వానికి భుక్తిలేదు’ – రైతు కష్టం లేనినాడు మానవాళి జరుగుబాటు ఉండదు సరికదా పుడమి మనుగడే కష్టసాధ్యమని ఈ చిట్టిపద్యంలో తేల్చిపారేస్తాడు.’ధర్మమున పిరికి తనము ఎప్పుడును లేదు / సత్య వాక్యమునకు చావులేదు / వెరవనేల నీకు విశ్వనాధుని మ్రోల / సృష్టికర్తతాను సృష్టినీవు’ – కర్మ సిద్ధాంతం పేర నోరుకట్టేసి స్వార్థపరులు తన భుక్తిని అనుభవిస్తున్నారు. అసలు కర్మ అంటే ఏమిటి? సాటి మనిషిపై ఈ కక్ష ఎందుకు? ఆ ఈశ్వరుని చేతే రుజువు చేయించమని ‘గబ్బిలానికి’ విన్నవిస్తాడు.
‘జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. ఒకటి పేదరికం. రెండు కులవివక్ష. ఒకటి నాకు సహనం నేర్పితే, రెండవది నాలో ఎదురించే శక్తిని నింపింది. కానీ నన్ను బానిసగా మాత్రం ఏదీ మార్చలేదు. అటు దారిద్య్రాన్ని, ఇటు కులవివక్షను చీల్చి చెండాడి నన్ను నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తికట్టాను. నాది కత్తి కవిత. కానీ నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని (వ్యవస్థ) విధానంపైనే ‘ద్వేషం’ అంటూ కసితో ఆజన్మాంతం రగిలిపోయాడు. దుర్మార్గాలను దునుమాడాడు. అక్రమాలపై స్వైరవిహారంతో చెలరేగిపోయాడు.
‘కవిత్వం బ్రాహ్మణుల సొమ్మే’ అని అప్పకవి వంటివారి కరుడుగట్టిన అగ్రవర్ణ దుర్హంకారాన్ని తొలినాళ్ళల్లోనే కవిత్వంతోనే ధిక్కరించాడు. ‘ఆకులందు అణగిమణగి కవిత కోయిల పలుక వలెనోరు’ అన్న మహాకవి గురజాడ వాక్కులను నిజం చేసాడు. కవికోకిలగా చరిత్ర దురగతాన్ని ప్రసిద్ధికెక్కాడు.
జాషువా కావ్యరచన ఏదైనా సరే తన సొంత గొంతుక ఒకటి చుక్కల్లో చంద్రునిలా తారాడుతూనే ఉంటుందని లాక్షణికుల పరిశీలన. నిలువెల్లా కవి గనుకనే తెలుగు పద్యానికి పునఃప్రాణ ప్రతిష్ట చేసాడు. పద్యానికి సానపెట్టి సామాజిక మార్పుకు సాధనం చేసాడు. ధనమూ ధాన్యమూ ఒకని పెత్తనం క్రింద ఉండనే ఉండరాదని శాసించాడు. ప్రజలందరికీ చెందాలని ఆశించాడు. పీడిత శ్రామిక జనోద్దరణ కోసం కలం కంకణం కట్టుకున్నాడు. మానవ కల్యాణం మించిన పని మహిలో లేదన్నాడు. అనంత ఆర్ధ్రత, అపార భావుకత కల పారదర్శక కవి కాగలడం తెలుగువారి అదృష్టంగా భావించాలని తెలిపారు.
వర్ణించే వస్తువుతో కవిగా జాషువా మమేకమయ్యే తీరు అనూహ్యం.
‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగా జూచి
చూపు రేఖా కమనీయ వైఖరులు గాంచి, భళీ భళీ
యన్నవాడే, మీ దే కులమున్న ప్రశ్న వెలయించి
చివాలున లేచిపోవుచో బాకున గ్రమ్మినట్లుగున్‌
ప్రార్థివ చంద్ర వచింప సిగ్గుగన్‌’
కరుణరస అంతర్వాహికగా వీర రసాన్ని ప్రవహింప చేసి వివక్ష కుళ్ళు ను కడిగిపారేస్తాడు.
ఆధునికత్వం అడుగడుగునా తన్నుకుంటూ వస్తుంది జాషువా కవిత్వంలో. పాత రూపాలకు కొత్త సొబగులు, కొత్త సొబగులకు కొంగ్రొత్త వెలుగుల అభివ్యక్తీకరణలు. నిబిడాశ్చర్యంగావడం పాఠక శ్రోతల వంతు.
‘రాజు మరణించు ఓ తార నేలరాలు / కవియు మరణించు ఓ తార గగన మెగసె / రాజు జీవించు రాతి విగ్రహములందు / సుకవి జీవించు ప్రజల నాల్కలందు’
1895 సెప్టెంబరు 28న వినుకొండ (ఏపీ)లో జన్మించిన గుర్రం జాషువా 1971 జూలై 24న అస్తమించాడు. కులవివక్ష కారణాన చిరుప్రాయంలోనే పాఠశాల వేదికలెక్కి పద్యాలు చదవలేకపోయాడు.. నాటకాలు చూడలేకపోయాడు. ఒంటరిగా కుమిలిపోయాడు. గౌరవం కులానికా? కలానికా? అని ప్రశ్నించాడు. ‘నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని’ హెచ్చరించాడు.
తన కాలంలో వీచిన సాంఘిక దురాచార తుఫాను గాలులను మొక్కవోని దీక్షతో ‘ఢ’కొన్న ధీశాలి జాషువా.
పిరికివారు సాకులు వెతుకుతారు. ధీమంతులు దారులు వెతుకుతారు. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన జాషువా ఆశయాలకు – ఆచరణకు మధ్య నిత్య ఘర్షణకు లోనైనా అంతిమంగా విజయ బావుటానే ఎగురవేసాడు. కవిత్వమే జీవితంగాను జీవితమే కవిత్వంగాను మలచుకోవడం వలనే జాషువా కృషి అనితరసాధ్యం.
(రేపు గుర్రం జాషువా 128వ జయంతి)
కె. శాంతారావు
9959745723