డా.ఎన్‌.గోపి కవిత్వంలో ‘కవిత్వ కవిత’

డా.ఎన్‌.గోపి కవిత్వంలో 'కవిత్వ కవిత'కవిత్వమనగానే కవులు రకరకాల వస్తువులను ఆశ్రయిస్తారు. కొన్ని సందర్భాల్లో వస్తువు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా మన చుట్టే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లోపల దమనంలో ఉన్న భావాలను కాగితంపై కుప్పపోయాల్సి వస్తుంది. కొంతమంది కవులు కవితను గొప్పగా రాయాలని అలంకారాలను, భాషను ఒక పథకం ప్రకారం పేరుస్తారు. ఎన్ని చేసినా కవిత పండేది సహజాతి సహజ స్థితిలోనే. కవి నేర్పును బట్టి వస్తునిర్వహణ ఉంటుంది. ఇవన్నీ రకరకాల వస్తువులను తీసుకొని రాసే సందర్భాలు. మరి మనం ఈ వ్యాసంలో మాట్లాడుకునేది కేవలం కవిత్వం వస్తువుగా తీసుకొని రాసిన కవితలు మాత్రమే. అలాంటి కవితలనే మనం ‘కవిత్వకవిత’ అని అంటాం. కవి దష్టిలో కవిత్వం ఎలా ఉండాలో తెలియజేస్తూ రాసే కవితే కవిత్వకవిత. డా||ఎన్‌.గోపి గారి కవితాసంకలనంలో చాలావరకు వీటిని చూస్తాం. అది వారికి కవిత్వం పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమ.
గోపి గారి కవిత్వంలో వస్తువిస్తతి ఎక్కువ. రాసిన కవిత్వమంతా ఒక ఆర్డర్‌లో ఉంటుంది. ఇంతవరకే రాయాలన్న పరిమితులు లేవు. సార్వజనీనత, సమకాలీనత వారి కవిత్వంలో కనబడుతుంది.
మొదటి పుస్తకం ‘తంగేడుపూలు’ నుండి నిన్న మొన్న వచ్చిన ‘క్రియ-ఒక జీవనలయ’ వరకు వున్న సాహిత్యాన్ని పరిశీలిస్తే కవిత్వ నిర్మాణపరంగా వారి క్రమశిక్షణ ఆశ్చర్యపరుస్తుంది. కాలమాన పరిస్థితులను బట్టి మొదట్లో కవితలో అలంకారాలు, పదబంధాలు విరివిగా వేసి బిగుతు చేసి రాసేవారు. తర్వాతికాలంలో సరళ వచనంతోనే గాఢతను సాధిస్తూ కవితా దిశను, స్వరూపాన్ని మార్చి వచనకవులకు కొత్తబాట వేశారు. వారు ఎలా రాసినా కవితావాక్యం సరికొత్త పుంతలు తొక్కి కవిత్వానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది తప్ప ఫలానా కవితలో చేసిన ప్రయోగం విఫలమయింది అన్న మాటే లేదు.
కవిత్వం రాయటం గొప్ప కళ. ఏదో మాయ చేసి నాలుగు వాక్యాలను పేర్చటం కవిత కాదు. కవితలో నుంచి సూర్యుడు ఉదయించాలి. లౌక్యంతో రాయటం కవిత కాదు. మదిలో పది కాలాలు నిలవగలగాలి. అలాంటి కవిత్వం రాయలేనప్పుడు పేజీలను హింసించి ఉరి తీయడం భావ్యం కాదు కదా!
గోపిగారు అందుకోసమే కవిత్వాన్ని చంపకు రా నాయనా, ఆత్మహత్య చేయించకు అని చెబుతూ ‘నిత్యారుణ గీతం’ అనే కవితలో కవిత్వం ఎంత గొప్పదో తెలియజేశారు.
”లోకంలో మునిగిన సూదంటురాయివై అనుభవాలను రాల్చి/ కవిత్వంగా పేరుస్తున్నావు/ సంవేదనకు సంతప్తి ఉండదు/ మరణ సదశ్యమది/ నది సముద్రంలో ఆత్మహత్య చేసుకున్నట్టు” (ఎండపొడ, పేజీ 22) కవి నిద్రలేని రాత్రులు గడుపుతాడు. కవిత రాయటం కోసం ఆరోగ్యం చెడిపోయే సందర్భాలెన్నో. కవిత్వం అంటే పిచ్చి కవికి. లక్షలు కావాలనడు. జీవించడానికి కనీస అవసరాలు ఉంటే చాలు అనే నిజాయితీతో జీవిస్తాడు. ప్రాణం పెట్టి కవిత్వం రాస్తాడు. ఇంత చేస్తే చివరికి అతనికి మిగిలేది ‘రాసిన నాలుగు అక్షరాలే’. గోపిగారు రాసిన ‘కవి కన్నా కవిత గొప్పది’ కవిత చదివితే కవికి, కవిత్వానికి మధ్య ఉండే సన్నని చీలిక తెలుస్తుంది.
”కవి కన్నా కవిత గొప్పది/ కవి మరణిస్తాడు/ కవిత బతుకుతుంది/ కవి మనిషి/ కవిత మానవత” (ఎండపొడ, పేజీ 35). కవిగా ఎంత లీనమైతే ఇంత తాత్వికతను వారు ఈ కవితలో అందించారు. దాదాపు ప్రతి కవితలో ఎత్తుగడలోనైనా, వస్తు నిర్వహణలోనైనా, ఆఖరికి ముగింపులోనైనా కవిత్వానికి సంబంధించిన వాక్యం రాకపోతే వారికి ఆ పద్యం అసంపూర్ణంగా అనిపిస్తుంది కావచ్చు.
గోపి గారి కవిత్వ కవితలు చదువుతుంటే కవిత్వానికి సంబంధించిన గాఢమైన భావాలు అల్లుకొని విడిచిపెట్టవు. కవిత్వమంటే ఇంతలా కవి ఆవేదన చెందాల్సి ఉంటదా? ప్రయత్నం చేయాల్సి ఉంటదా? అని అనుకునే వ్యక్తుల సందేహాలను పటాపంచలు చేసేట్టుగా సులువుగా అర్థం చేయిస్తారు. ”కవిత్వాన్ని నిర్మించే క్రమాన్ని మార్మికంగా చెబుతూ దానికి జీవితాన్ని ముడిపెట్టి వచనకవితకో కొత్త నిర్వచనాన్ని సష్టించటంలో గోపి గారిది అందెవేసిన చేయి. ‘గుడ్డు’ అనే కవితలో వారు కవిత్వానికిచ్చిన నిర్వచనాన్ని ఆస్వాదిద్దాం.
”గుడ్డు పెట్టడం కాదు/ పొదగడం ముఖ్యం/ చుట్టూ గోడలుడిగి/ పుట్టకముందే/ ఖైదీలుగా ఉన్న భావాలకు/ ముక్తిని ప్రసాదించడమే ‘కవిత్వం’/ కవిత్వానికి ప్రాణమే ప్రాతిపదిక/ జీవితం దాని వేదిక” (మళ్ళీ వితనంలోకి, పేజీ 65). కోడి గుడ్డు పెట్టినప్పటి నుండి పిల్లగా మారేంత వరకు జరిగే ప్రక్రియలలాగే కవిత్వముంటదని ఆ పిల్ల ప్రాణం పోసుకున్నట్టే కవిత్వానికి ప్రాణమే మూలమని చెబుతూ వీటన్నింటికి తోడ్పాటునందించే వేదిక జీవితమని తాత్వికతా దోరణిలోంచి నిజనిర్ధారణ గావించారు.
కవిత్వ కవితలు కాని వాటిలో కూడా మనం కొన్ని కవిత్వానికి సంబంధించిన వాక్యాలను గమనిస్తాం. ఉదాహరణకు ‘బల్లి’ అనే పేరుతో రాసిన కవితలో మధ్యలోకి వెళ్ళాక ”నా కవిత్వంలో/ ఏదో వాసన దొరికినట్టు/ కొద్దిదూరంలో ఆగి/ నా వైపు చూస్తుంది” (జీవన భాష, పేజీ 83) అనే వాక్యాలతో ఆ వస్తువును నడిపించుకుంటూ జోడించారు. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు కవిత్వం గోపి గారి ప్రతి అడుగులో ‘ముందయి’ నడుస్తుందని అవగాహన చేసుకోవచ్చు.
చాలా కవితల్లో వారు కవిత్వాన్ని కలవరిస్తుంటారు. కవిత ప్రారంభం నుంచి చివరిదాకా చదివినప్పుడు ఏవో రెండు వాక్యాల్లో కవిత్వ సంబంధిత వాక్యాలు తళుక్కున మెరుస్తాయి.అవి మచ్చుకు ఇంకొన్ని చూద్దాం.
1. ఎండలో కవిత్వం/ సలసల కాగిపోతుంది (ఆర్తి అనే కవితలో పేదబతుకుల జీవనం ఎండలో ఎలా మగ్గిపోతుందో చెప్పడానికి ఈ వాక్యాలు రాశారు)
2. కొంచెం మట్టి తెచ్చి కాగితంపై చల్లాను/ అవే ఈ అక్షరాలు (‘ఆకాశం మట్టి’ కవితలో మట్టి యొక్క గొప్పతనం చెబుతూ కవిత్వాన్ని ఆపాదించి చెప్పిన మాటలు)
వారు రాసిన కవితా సంపుటాల నుంచి తీస్తే ఇలాంటి కవితా సంబంధిత వాక్యాలు కోకొల్లలు దొరుకుతాయి. రేఖా మాత్రం స్పర్శలోనే కవిత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వ్యాసం ద్వారా మనం గ్రహించాం.
గోపి గారు కవితా సంపుటాల్లో రాసిన ప్రతీ ‘కవిత్వ కవిత’ ఒక ఆణిముత్యం. కావాలని పనికొట్టుకొని రాసిన కవిత్వం కాదు. సహజాతి సహజమైన ధోరణుల తీరు కవిత్వంలోకి ప్రవేశించింది తప్ప ఎక్కడా కతకంగా లేదు. వారు కవిత్వ కవితలన్నింటిని కవితా సంపుటిగా వేస్తే కవిత్వం ప్రాశస్త్యం ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని నా భావన.
పెన్నా శివరామకష్ణ ‘ఎన్‌.గోపి కవిత్వ కవిత’ అనే వ్యాసంలో గోపిగారు రాసిన కవిత్వ కవితల్లో కూడా కొంతలోకొంత అతిశయోక్తి కనిపిస్తుందన్న భావన వెలిబుచ్చాడు. ఇన్ని పరిశీలనలు చేసి ఈ వ్యాసం రాసిన తర్వాత ఆ వాక్యాలతో నేను ఏకీభవించడానికి సంసిద్ధంగా లేను. కవిత్వం గూర్చి గొప్పగా చెప్పాలని ఆకాంక్ష తప్ప అతిశయోక్తి గోపిగారు రాసిన ఏ కవితా పాదంలోనూ కనిపించదు.
”నిత్యం/ అక్షరాల్లో దగ్ధమవుతూ/ అజరామర గీతమై బతుకుతాను” అని గోపి గారు రాసిన వాక్యాలు చదివితే ‘కవిత్వం’ అంటే వారికి ఎంత ప్రాణసమానమో అర్థమవుతుంది. వారు చెప్పుకున్నట్టుగా కవిత్వమున్నంత కాలం ‘అజరామర గీతమై’ అందరి గుండెల్లో పదిలంగా ఉంటారు. వారు సష్టించిన ప్రక్రియ పరంగా నానీల గోపి అంటున్నారు. కవిత్వకవితలను అన్నింటిని చదివినంక వారిని కవిత్వ ‘గోపి’ అని పిలవాలనిపించింది.
(జూన్‌ 25న డా.ఎన్‌.గోపి 75 వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ‘రేపటి మైదానం’ కవితాసంపుటి ఆవిష్కరణ సభ సాయంత్రం ఆరు గంటలకు)
– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551