డా|| సి.నారాయణరెడ్డి ప్రజా సంబంధాలను, మానవ బంధాలను గౌరవించిన వ్యక్తి. సినారె తమ సమకాలికులైన రచయితల మీద, నెహ్రూ వంటి గొప్ప రాజకీయ నాయకుల మీద, సినీ ప్రముఖుల పట్ల అవినాభావ అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ రాసిన 55 కవితా ఖండికలను గంగ, డా||జె.చెన్నయ్య సంయుక్తంగా సంకలనం చేసి ‘సమన్వితం’ అన్న పుస్తకాన్ని వారి 93వ జయంతి సందర్భంగా వెలువరించడం అభినందనీయం.
ఈ కవితాఖండికలు చదివిన ఎవరికైనా రెండు అంశాలు స్ఫురిస్తాయి. ఒకటి – కవితా వస్తువుగా మారిన సాహితీమూర్తి మూర్తిమత్వం. రెండు – వారి పట్ల వ్యక్తమైన భావాల మాధ్యమంగా సినారె మూర్తిమత్వం. దాశరథి, సినారె అన్నదమ్ములుగా మెలిగినవారు. ఆయనమీద 1953లో రాసిన ‘కవితాలోక ప్రభానీరథీ’ అన్న కవితను సినారె పద్యాలలో రాయడమే సముచితం. ఎందుకంటే దాశరథి పద్యకవిగానే సుప్రసిద్ధులు. పద్యకవిత్వ ప్రాగల్బ్యం వల్లనే ‘మహాకవి’ బిరుదును పొందగలిగారు. ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు చదువుకున్న సినారె దాశరథి కవితలను ‘మహోల్కా సముజ్వలకాంతి స్ఫురదగ్ని గీతికాలు’ అంటూ ప్రౌఢ సమాసం ద్వారా కవిత్వ ధ్యేయమైన సమాజ ప్రయోజన కాంక్షను ప్రకటించడం అద్భుతం. ‘అగ్ని’ శబ్దం ‘అగ్నిధార’ను గుర్తుచేస్తుంది.
‘అతిమస్పణమైన నీ/ అమృత హృదయములోని/ సంగీతమే చెంగలించు’ అంటూ విశ్వనాధ ‘కిన్నెరసాని’ ప్రవాహంలో తన రసగంగను సమ్మిళితం చేశారు సినారె. మరోమాట – కిన్నెరసాని ఏరు తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నది. అందుకే ఈ అభినందన కవితలో ఆత్మీయ స్పర్శ అనుభూతమవుతున్నది.
‘అరుణార్కుడు గోర్కీ’ అన్న గేయ కవితలో కమ్యూనిస్టు భావజాలాన్ని స్ఫురింపజేసే ‘విప్లవసాహితికి ఓనమాలు దిద్దిన’ వాడిగా, ‘నిరుపేదల నిట్టూర్పులను సుడిగాడ్పులుగా మార్చి’న వాడిగా ఆ మహా రచయితకు నివాళులర్పించారు సినారె.
శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా రాసిన ‘సరిసిరిపాప’ గేయకవితలో ‘ధనస్వామ్య మల్లాడిపోవగా/ జనస్వామ్యమర్రెత్తి చూడగా/ ఘనఘనాఘన స్వనగళమ్ములో/ గర్జించిన ప్రళయోర్జితమూర్తికి ‘షష్టిపూర్తి’యట అంటూ ‘మహాప్రస్థానం’లో ప్రకటితమైన శ్రీశ్రీ సామ్యవాద కవిత్వ స్వరూప స్వభావాలకు అక్షరరూపమిచ్చారు సినారె. మరోకవితలో – ‘అతడు నడిస్తే నడిచాయి వేయి ఊళ్లు/ అతడు అరిస్తే అరిచాయి కోటి నోళ్లు’ అంటూ శ్రీశ్రీకి వున్న అపారమైన జనాదరణను గూర్చి పేర్కొన్నారు. మగ్దూం మహియుద్దీన్ మరణించినప్పుడు రాసిన సంతాపగీతంలో ‘సమీరకాహళీస్వరాలలో/ సమరగీతం మ్రోగినప్పుడల్లా నీవు వినిపిస్తావు మక్దూం’ అంటూ ఆ మహాకవి జీవలక్షణాన్ని ఎలుగెత్తి చాటారు.
ప్రజాగాయకుడు గద్దర్ మీద హత్యాయత్నం జరిగినప్పుడు ‘పాటను కాల్చేస్తారా’ అన్న కవిత రాశారు. గద్దర్‌ను పాటగా భావించి ‘ఎక్కడ దోపిడి వుంటే/ అక్కడ తొడగొట్టింది’ అని అనడమే కాక, ‘ఏ చెరలో తొక్కేసిన/ ఎర్రగ ఎగిరే పతాక’ అంటూ నిర్బంధాలకు జంకని సమున్నత వీరునిగా గద్దర్‌ను వర్ణించారు. పై కవితలే కాదు భగత్‌సింగ్ వంటి వ్యక్తిత్వాల మీద రాసిన కవితలలో కూడా సినారె వామపక్ష భావజాల పక్షపాతిగా కనిపిస్తారు. అందుకే ‘భగత్‌సింగు చరితం ప్రగతి శీల భరితం/ తిరుగబడిన క్రాంతిసేన తీసుకున్న శపథం’.
‘అతడు ప్రతాపరెడ్డి…’ అన్న పద్యంలో సురవరం వారిని సూర్యునిగా అని అనగలిగారు. స్నేహితునిగా నిరూపించిన సినారె పద్యం అనితర సాధ్యం.
జవహర్‌లాల్ నెహ్రూ పట్ల సినారెకు వున్న అభిమానం దేశభక్తి ప్రేరితం. ఆయన మరణవార్తకు తట్టుకోలేక రాసిన గేయకవితల పరంపర ఆ తర్వాత ‘జాతిరత్నం’ (1967) పేరిట ఒక సంపుటిగా వెలువడింది.
‘గాంధీజీ స్వప్నఫలం/ గంగలో కలిసెనయ్యా/ విశ్వంభర కంటిపాప/ వెలుగే మాసినదయ్యా’ (పిడుగుపాటు) అంటూ నెహ్రూ రాజకీయ విశ్వాసాలలోని సగభాగం శాంతి అహింసల గాంధేయవాదం ఆయన మరణంతో ప్రమాదంలో పడ్డదంటున్నారు. ఇక మరో సగభాగం రష్యా ప్రభావంతో రూపుదిద్దుకున్న సోషలిజం జీవలక్షణంగా అభివృద్ధి ప్రణాళికలు రచించిన సంగతి విదితిమే.
‘ఆ పడమర ఈ తూరుపు/ నీ పలుకుల పందిరిలో/ కొంగులు ముడివేసుకున్న/ బంగరు కామ్ముమాది’ అంటూ దిగంతాల దాకా శాంతిదూతగా వెలిగిన నెహ్రూ శకాన్ని స్వర్ణయుగంగా భావించడం గొప్ప నివాళి.
కాళోజీ, గోపీచంద్, బుచ్చిబాబు, మాధవశర్మ వంటి అగ్రేసరులను గూర్చి చలన చిత్ర నటులను గూర్చి, సంగీత విద్వాంసులను గూర్చి రాజకీయ నాయకులను గూర్చి సందర్భానుసారంగా సినారె రాసిన కవితలు చరిత్రకారులకు కూడా పనికివస్తాయి. సినారెను సమన్వయవాదిగా నిరూపించే ఈ కవితలను వెతికిపట్టుకుని కాలక్రమంలో పేర్చి పుస్తకంగా ప్రచురించిన సంపాదకులది మంచి పరిశోధన.
– అమ్మంగి వేణుగోపాల్, 9441054637