నిగూఢతను బద్దలు కొట్టిన కవిత్వం

Poetry that breaks the mysteryకాలం అనేది భాషాపరంగా చూస్తే చాలా చిన్న పదం. దాని అర్థం విశ్వమంత పెద్దది. కొందరి కవిత్వం చదివితే కాలం చెల్లినదిగా సమకాలీనతకు, ఆధునికతకు దూరంగా ఉన్నదిగా తోస్తుంది. ఇంకొందరి కవిత్వం మరో ఇరవయ్యేండ్లైనా తాజాదనం కోల్పోదు. ఏటూరి నాగేంద్రరావు ‘అలా ఆగు కాసేపు’ కవిత్వం చదువుతుంటే తను కాలంతో పాటు ప్రయాణిస్తూ కాలాన్ని కాసేపు ఆపి గతితప్పిన మనుషులకు ఒక ప్రేమపూర్వక హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ నాకు కురుక్షేత్రంలో గీతాచార్యులు గుర్తుకు వచ్చారు. అలా కాలంలో నిలబడే కవిత్వం.
మనసు ఏ వయసులోకైనా, ఏ ప్రాంతానికైనా అనుకున్నది తడవు వెళ్లిపోగలదు. ఇక చూసిన ప్రదేశం అయితే చెప్పేదేముంది. అణువణువును చూసి రాగలరు. ఈ మనసు అనేది ఓ పట్టాన అర్థంకాదు. ఒక చోట అంటూ ఉండదు. అలాంటి చంచలమైన మనసును పట్టి అదే మనసు పెట్టి అనుభవాలు, ఆచరణల మేళవింపుగా రాసిన కవిత్వం ఇది. వీరి నుంచి అప్పుడప్పుడు చీలిపోయే మరో మనిషి మనసే అనుకుంటా. ఎందుకంటే మనల్ని మొదట ప్రశ్నించినా, పరిహసింపబడేలా చేసినా అది మనసే కదా. వీరిని మనస్తత్వ జ్ఞాన సంపదతో పాటు కర్తవ్య బోధ ఆవహించి ఉందనేందుకు ఈ కవిత్వమే సాక్ష్యం. అందుకు ఆయనకు తగిలిన గాయాలు కూడా కారణమై ఉండొచ్చు.
వీరు రాసిన కవిత్వం యావత్‌ సమాజానికీ వర్తిస్తుంది. ప్రతి పదంలో మనిషి ముసుగు తేటతెల్లమవుతుంది. నడిచొచ్చిన దారినిబట్టి ఎవరికివారు దీన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతి జీవికీ వచ్చే మరణంలాగా లక్ష్యమైతే ఒకచోటే ఆగుతుంది. కవి తను రాసిన ప్రతి కవితనూ ముప్పై లైన్లలో ముగించారు కాబట్టి మరో కవితలోకి మారే క్రమంలో పాఠకుడు ఊపిరిపీల్చు కునేందుకు కొంత విశ్రాంతి లభిస్తోంది. లేకుంటే, ఈ కవిత్వానికి కనెక్ట్‌ అయి కొట్టుకుపోతున్న వారి గతి ఏం కాను? కనీసం మునిగి తేలడానికైనా కొంత విరామం అవసరం కదా. దాన్ని పాటించారు కాబట్టే నా లాంటివారు బతికిపోయారు. దీర్ఘ కవితగా మార్చి ఉంటే ఆత్మ పరిశీలనా మోహపు లోతుల్లో తపస్సులో మునిగిపోయేవాళ్ళం.
బరువైన విషయాన్ని భారంగా మోస్తూ ఏదో షార్ట్‌ కట్లో కాకుండా ఆవేశంగా ఆపై మరింత బాధ్యతగా గమ్యాలు చేరడమనే ఈ కుదింపు కవిత్వం రాయడం అందరికీ సాధ్యం కాదు. నీతివశుడై నిజాయితీగా రాస్తున్న ఈ కవిత్వాన్ని చదువుతుంటే నాకైతే కొంత భయమేసింది. ఎక్కడైనా తెలుసో తెలియకో ఒక తప్పైనా చేయకపోయి ఉంటానా కవి సంధించిన అనేకానేక శర పరంపరలు కర్మసాక్షిగా కచ్చితంగా ఏదో ఒక బాణమైనా నన్ను తాకకపోదా అనే భీతి వెంటాడింది. అయితే ఊరటనిచ్చేలా ఉన్న ప్రతి కవిత చివరి వాక్యం పరివర్తనా క్రమానికి ధైర్యాన్ని నింపింది.
ఇక్కడేమీ లేదు అంతా కాలి కమురుకుపోయింది. కొండెక్కి ఉందంటూనే చమురు పోసి కాస్త వత్తి ఎగదోసి చిన్న సీతాకోకచిలుక లాంటి చిగురులు చూపిస్తాడు. ముందుగా యమపాశం దర్శనం చివరిగా ప్రేమపాశ సాంత్వనం ఇతని ప్రత్యేకత.
కవి తనను తాను ప్రతి వాక్యంలోనూ బయట పెట్టుకున్నాడు. కప్పిపెట్టిన మనిషి తనాన్ని వెలికితీసే పనిలోపడ్డాడు. తనను తానుగా తనదైన లోకానికి లొంగి పోయి ఏదో మర్చిపోయి వచ్చినట్టు మార్చాల్సినది అలాగే ఉందంటూ ఒక అశాంతితో పోరాడు తున్నాడు. ప్రతి చిన్న కవితలోనూ ఉన్నతమైన భావాన్ని చెప్పుటకు ఆరాటపడ్డాడు. గుర్తించే లోపు మాయమైన ఒక పద్యాన్ని మరవకుండా స్మరించే పసితనం వసంతంలో మనిషిని నిలపాలనే పెద్దరికం రెండూ ఉన్నాయి ఇతనిలో. ఒకానొక బంధాల బ్రాంతిలో ఉంటూ దానికై నిలబడతాడు. మంచిదను కున్న దారిలో చిన్న పొరను కూడా పోగొట్టు కోవాలని అనుకోడు. అబద్ధపు రూడీలు చూపి ఎప్పుడో మూసేసిన కేసులు ఏ సిన్సియర్‌ ఆఫీసరో వచ్చి తిరగ తోడి వాస్తవాలను వెతికి తీసి చూపుతుండగా నివ్వరపోయి చూస్తున్న సామాన్య మనుషుల్లా ఈ కవిత్వం చదువుతున్నంతసేపు ఉండిపోయాను.
ఈ కవిత్వానికి ఎన్ని శీర్షికలైనా పెట్టుకొనే వెసలుబాటు, విశాలత్వం ఉంది. జీవితాన్ని సున్నా దగ్గర మొదలుపెట్టి నుజ్జు నుజ్జుగా నలుగుతూ ఆపసోపాలు పడుతూ కొంత దూరం ప్రవహించిన వారికి బాగా అర్థమవుతుంది.
‘చావును ముద్దు పెట్టుకోవడం చేతకాని వాడికి స్వప్న మందిరాలు కట్టే హక్కు లేదు’
‘చూపుడువేళ్ళు గట్టిగానే ఉన్నాయి
భయం నుంచి భయం పుట్టదు’
‘అయ్యో కొన్ని ఆనందాలకోసం ఎంత నెత్తురు వధా అయిపోయింది’
‘అప్పుడప్పుడు మత్యువాణి వినిపిస్తున్న గాయకుడి గాత్రం జీవితం’
‘నేను ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. ఎలా తప్పించుకోగలను’
ఇలాంటి వాక్యాలే కదా తెలుగు కవిత్వాన్ని నిలబెట్టేది.
‘నిజమే కార్చిచ్చు నుంచి అడవిని కాపాడినంత సులభం కాదు అక్షరంతో సమాజాన్ని మార్చడం’. ఐనా! కవి మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. నిజాలను చూడ్డానికి అనంత హదయం కావాలి. కీర్తికాంక్షల సౌధాలు కల్పనలని చెప్పే ఈ పుస్తకం చదవకపోయి ఉంటే నన్ను నేను తెలుసుకొనుటలో కొంత వెనుకబడేవాన్ని. కోయిలకు, కాకికి బాధలుంటాయి. ఈ కవిని ఏ జాతి పక్షి అంటే నేనైతే జాతీయ పక్షి అని టక్కున చెప్పగలను. ఆలోచనలు సరిగ్గా లేక పిచ్చిగంతులు వేస్తున్న దేశానికి ఇలాంటి పక్షుల అవసరం చాలాఉంది. చావు భూమి గురించి చెప్తూనే జోలెలో దాచుకున్న విత్తనాల్ని భద్రంగా నేలన నాటే ప్రయత్నం చేసి ఆత్మ పరిశీలనా సర్వస్వ కవిత్వాన్ని అందించిన ఏటూరి వారి రుణం ఈ నాలుగు మాటలతో తీరిపోదు. ఇతని కవిత్వం చదివాక నా వెంట్రుకలు ఇంకా నిక్కబొడుచుకునే ఉన్నాయి. సెల్యూట్‌ సర్‌.
యాములపల్లి నరసిరెడ్డి
9603759059