మన దేశంలో వసంత రుతువు ఎన్నికల రుతువును తోడుకొని వస్తుంది..
పాత ఆకుల్ని రాల్చి, కొత్త చిగుళ్లు పూయించడం రుతు ధర్మం..
వసంతం ప్రజల బతుకుల్లోకి వచ్చినా! రాకున్నా? రుతువు వచ్చిపోతోంది..
కోయిలలు, కవి కోయిలలు సం(స్కతి)ప్రదాయ రాగమెత్తాల్సిందే..
ఎన్నికల రుతువులో మన నాయక కోయిలలు
అధికారం(ఓట్ల)కోసమో కొత్త ఆశల చిగుళ్లు పూయించేలా
హామీల,తాయిలాల రాగం ఎత్తుకొంటున్నాయి..
ఏ రాగం వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉందో..
చిగుళ్లు (సత్కారాల)మత్తులో, కవి కోయిలలు గ్రహించకపోతే?
ప్రమాదం పచ్చదనానికి, ప్రజానీకానికే..
ఎన్నికల్లో నాయక కోయిలలు చెట్లు చిగుళ్ల నుండి గొంతెత్తడం లేదు..
రాముని గుడి గోపురం నుంచి అలౌకిక మత రాగామృతంలో ముంచుడేందో!
లౌకిక రాజ్యంలో.. ఆకలి కేకల సంగతేందో? ఆలోచించాలి..
ఈ దేశపు పచ్చని చెట్టు లాంటి సంపదనే చిగుళ్లు తింటూ..
శ్రీమంతుల పాట పాడుతున్న నాయక కోయిలలు హోరులో.. కనిపించకపాయె!
కోయిలల కుహు.. కుహు రాగాలు..
కవి కోయిలైనా.. ”శ్రీ క్రోధి”నామ వత్సరాన
ఉగాదుల, ఉషస్సులు పూయించే ప్రజారాగం ఎత్తాలి..
– మేకిరి దామోదర్
9573666650