విషోన్మాదం

విషోన్మాదం– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై మోడీ తప్పుడు ప్రచారం
– ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు ప్రత్యేక కోటా అంటూ వక్రీకరణలు
– ప్రధాని తీరుపై మేధావులు, నిపుణుల అసంతృప్తి
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఈనెల 2న జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. మరోసారి తన ముస్లిం వ్యతిరేక ప్రసంగాన్ని వినిపించారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రధానాంశంగా మారిన ముస్లిం వ్యతిరేక సందేశాన్ని పునరావృతం చేస్తూ కొత్త ఆరోపణను జోడించారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ టెండర్ల కేటాయింపులో ముస్లింలకు ప్రత్యేక కోటా రూపొందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, ప్రతి అంశంలోనూ బుజ్జగింపులతో నిండి ఉన్నదని వివరించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు ఎప్పుడూ సరైన అర్హతల ఆధారంగానే జరిగాయనీ, మతం, కులాల ప్రాతిపదికన కోటాలు ఖరారు చేయడం సరికాదని మోడీ తెలిపారు. అయినా కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకు కోసమే ఇలా చేస్తున్నదని ఆరోపించారు. అయితే మోడీ వాదనలో వాస్తమున్నదా? 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో నిజంగా ముస్లింలకు ప్రభుత్వ పత్రాల్లో కోటాను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తున్నది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ”పబ్లిక్‌ వర్క్స్‌ కాంట్రాక్టుల” గురించి రెండు చోట్ల ప్రస్తావన ఉన్నది. మొదటిది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన ‘ఈక్విటీ’ విభాగంలో, రెండోది ‘మత, భాషాపరమైన మైనారిటీలు’ అనే విభాగంలో ఉన్నది. ఆరో పేజీలోని 8వ పేరాలో..”ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు మరిన్ని పబ్లిక్‌ వర్క్స్‌ కాంట్రాక్టులు ఇవ్వటానికి పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ పరిధి విస్తరించబడుతుంది” అని ఉన్నది. 8వ పేజీ ఆరో పేరాలో..”విద్య, వైద్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్‌ వర్క్స్‌ కాంట్రాక్టులు, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సాంస్కృ కార్యక్రమాలలో వివక్ష లేకుండా మైనారిటీలు వారి న్యాయమైన వాటాను పొందేలా చూస్తాము.” అని ఉన్నది. ఎస్సీ, ఎస్టీల విషయంలో.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు మరిన్ని పబ్లిక్‌ వర్క్స్‌ కాంట్రాక్టులు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్తున్నది. మైనారిటీల విషయంలో.. ”మైనారిటీలు పబ్లిక్‌ వర్క్స్‌ కాంట్రాక్టులలో వివక్ష లేకుండా తమ న్యాయమైన అవకాశాలను పొందేలా చూస్తామని” హస్తం పార్టీ వివరించింది. మోడీ చెప్పినట్టుగా.. మైనారిటీలకు లేదా ముస్లింలకు నిర్ణీత కోటా గురించి మ్యానిఫెస్టోలో ఎక్కడా లేదు. మైనారిటీలకు వివక్ష లేకుండా న్యాయమైన వాటా కల్పిస్తామని వాగ్దానం ఉన్నది. మరొక పేరాలో..
”బ్యాంకులు వివక్ష లేకుండా మైనారిటీలకు సంస్థాగత రుణాన్ని అందజేస్తాయని” హామీ ఇచ్చింది. అయితే, దీనిపై కూడా మోడీ రాజకీయం చేసే అవకాశం ఉన్నదనీ, బహుశా ఆయన తన భవిష్యత్‌ ప్రసంగంలో ‘కాంగ్రెస్‌ బ్యాంకు రుణాల కోటా’కు కూడా వాగ్దానం చేస్తుందని ఆరోపించే అవకాశం ఉన్నదని కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.
ముస్లింలు ఉపాధి, విద్య, గృహనిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వివక్షను ఎదుర్కొంటున్నారనే వాస్తవం 2006లో సచార్‌ కమిటీ, 2014 అక్టోబర్‌లో ప్రొఫెసర్‌ అమితాబ్‌ కుండూ మోదీ ప్రభుత్వానికి సమర్పించిన తదుపరి నివేదిక వివరించింది. వాస్తవానికి, కోటాలు సమాజంలో విస్తృతమైన, వ్యవస్థాగత వివక్షను పరిష్కరించటానికి అనేక సాధనాల్లో ఒకటి మాత్రమేననీ, ప్రభుత్వం బదులుగా రిజర్వేషన్‌లకు మించి చర్యలు తీసుకోవాలని కుందూ ప్యానెల్‌ ప్రత్యేకంగా పేర్కొన్నది. ఇది సామాజిక న్యాయాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం.. పలు ప్యానెల్‌లు ఇప్పటివరకు చేసిన సిఫారసులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విశ్లేషకులు అంటున్నారు.
ముస్లింలే టార్గెట్‌గా..
ప్రభుత్వ టెండర్ల విషయానికి వస్తే.. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను తప్పుగా చూపించటానికి మోడీ ప్రయత్నిస్తారనీ, ముస్లింలు, మైనారిటీలే ఆయన లక్ష్యమని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయటం ఏ మాత్రమూ సమంజసం కాదని క్గాంరెస్‌ నాయకులు అంటున్నారు. భావోద్వేగ, విద్వేష రాజకీయాలు మాత్రమే బీజేపీకి వచ్చనీ, సకల జనుల శ్రేయస్సు గురించి మాత్రం వారికి ఎలాంటి అవసరమూ లేదని అంటున్నారు. వాస్తవానికి.. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ వివిధ స్థాయిలలో వివక్షను ఎదుర్కొంటున్నారనీ, ఈ వర్గాల భారతీయులు ఎదుర్కొంటున్న విస్తృతమైన సామాజిక, సంస్థాగత పక్షపాతాన్ని అంతం చేయాల్సిన అవసరమున్నదని నిపుణులు సూచిస్తున్నారు.
బీజేపీ అసలు లక్ష్యం రిజర్వేషన్లను ఎత్తివేయటమేననీ, అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను టార్గెట్‌ చేస్తే అధిక సంఖ్యలో ఉన్న వారి ఓట్లు దూరమయ్యే ప్రమాదమున్నదని భావించిన ప్రధాని మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొందరు ముస్లిం నాయకులు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇలా తప్పుడు వాదనలు, అబద్ధాలు చెప్పటం మోడీకి అలవాటైందనీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందినా ఎలాంటి స్పందనా లభించటం లేదని వాపోతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ.. ఈ విధగా దిగజారి అబద్ధాలు చెప్పటం, ఒక వర్గం ప్రజలను టార్గెట్‌ చేసుకోవటం ఏ మాత్రమూ సరికాదని మేధావులు, నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.