– పారిశుధ్య లోపం…కలుషిత నీరే కారణమా.?
– అధిక దోమల వల్లే సమస్య అంటున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో విష జ్వరాలతో తల్లడిల్లిపోతుంది. గ్రామంలో ఏ ఇంటిని చూసిన ఒకరిద్దరు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో ఎక్కువగా ఎస్సికాలనిలో గత నాలుగైదు రోజుల నుంచి వ్యాధులు సోకడం ప్రారంభమైందని గ్రామస్తులు చెబుతున్నారు. జ్వరం, కీళ్లు, శరీరమంతా నొప్పులు,దద్దుర్లతో బాధపడుతున్నట్లుగా పలువురు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో కూర్చుంటే లేవ లేక, నడవలేక పోతున్నారు. రోజుల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా నయం కావడం లేదని వాపోతున్నారు. వ్యాధి సోకిన వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందుతున్నారు.విష జ్వరాలకు మిషన్ భగీరథ నీరు కలుషితం కావడం ఒక కారణమైతే, పారిశుధ్య లోపమే మరో కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.డ్రైనేజీల్లో చెత్త, చెదారం,రోడ్లపై మురుగు నీరు ప్రవహించడంతో అపరిశుభ్రంగా మారి దోమలు,పందులు ఎక్కువగా కావడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని,అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం: వినోద, మహిళ
ఇంట్లో ఉన్న వారందరూ వ్యాధులతో బాధపడుతున్నాం. ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్ తీసుకోవడం, సెలైన్ ఎక్కించుకొని తిరిగి వస్తున్నాం. కానీ వ్యాధి నయం కావడం లేదు. తీవ్ర అవస్థలు పడుతున్నాం.
జ్వరం, కీళ్ల నొప్పులు, బాణమ్మ మహిళ
గ్రామంలో అందరూ రోగాలతో బాధపడుతున్నారు. నాకు జ్వరం, కీళ్ల నొప్పులు ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి ఆస్పత్రికి వెళ్లి వస్తున్నా నయం కావడం లేదు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, తగిన మందులు ఇవ్వాలి.
పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం, తాడిచెర్ల ఇంఛార్జి రాజు కార్యదర్శి
గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశాం. దోమల నివారణకు మందును పిచికారి చేయిస్తున్నాం. మురుగు కాల్వల వెంట బ్లీచింగ్ పౌడర్ను చల్లిస్తున్నాం. వాటర్ ట్యాంకు శుభ్రం చేయించే పనులు చేపట్టాం.