

నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్ ల వల్ల పల్లె పట్టణాల తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే 1 మృతిచెందగా అధికారులు అప్రమత్తమై హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. విష జ్వరాలను ఆసరాగా చేసుకుని కాసులకు కకృతి పడుతున్న ఆర్ఎంపీలపై వైద్యాధికారులు సీరియస్ అయ్యారు. పలువురు ఆర్.ఎం.పి పి.ఎం.పి క్లినిక్లను అధికారులు సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విష జ్వరాలతో నిజామాబాద్ జిల్లా వణికి పోతుంది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు అపరిశుభ్రత వల్ల వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి. పల్లె పట్టణాలు తేడా లేకుండా పట్టిపీడిస్తున్నాయి. సకాలంలో వైద్య సేవలు అందక దుస్థితి నెలకొంది. డెంగ్యూ మలేరియా వైరల్ బాధితులతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొంతమంది లోకల్ డాక్టర్లు తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధిక డోసు మందులను ఇస్తూ మరింత ముప్పు తీసుకువస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు పి హెచ్ సి లలో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది డెంగ్యూ విష జ్వరాల బారిన పడిన వారికి వైద్యం అందిస్తున్నారు.
ప్రయివేట్ ఆస్పత్రిలో దోపిడి..
నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూ, విష జ్వరాల కారణంగా కిక్కిరిసిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో దోపిడి కూడా అదేవిధంగా దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రిలో కొన్ని ఆసుపత్రులు తెగ బడి మరీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. పరీక్షలన్నీ చేసి ఉన్నా లేకున్నా చికిత్స అందిస్తున్నారు. కనీసం ఒక రోజైనా ఆసుపత్రులలో ఉంచుకొని బిల్లులు వేసి కట్టించుకొని మరి పంపుతున్నారు. మందులు, బ్లడ్ టెస్ట్ లు, త్వరగా నయం కావాలి అనే ఉద్దేశంతో రోగులకు భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా బిల్లులను వేస్తూ రోగుల నడ్డి విరుస్తున్నారు. దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్పందించి తనిఖీలు చేపట్టి ఏ ఆసుపత్రిలో ఎలా చికిత్స అందిస్తున్నారు అదేవిధంగా ఎలా బిల్లులు వేస్తున్నారు ఏమిటి అని ఆరా తీయాల్సిన బాధ్యత ఉందని ప్రజలు , రోగాల బారిన పడిన బాధితులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్న ఒపి
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్…….నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఫీవర్ వార్డ్ బాధితులతో నిండిపోయింది. రోజు 2000 పైగా ఓపి ఇక్కడ నమోదవుతూ వస్తుంది. ఇందులో 90 శాతం అవుట్ పేషెంట్లు ఫింగర్ల వల్లనే ఆసుపత్రికి వస్తున్నారు.. డెంగ్యూ జ్వరాలు కూడా జిల్లాలో పంజా విసురుతున్నయి. జిల్లాలో 350 పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు బోధన్ రూరల్ ప్రాంతంలో అధిక కేసులు నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏదైనా చికిత్సలు అందజేస్తున్నామని ఆస్పత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి విష జ్వరాలకు రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో ఓపి నమోదవుతుంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనరల్ ఫిజీషియన్ క్రిటికల్ కేర్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్
డాక్టర్ జక్కా రవి
రోజురోజుకు పెరుగుతున్న విష జ్వరాల ద్వారా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ జక్క రవి తెలిపారు. వాతావరణంలో మార్పుల వలనే డెంగ్యూ దోమలు విష జ్వరాలు పెరుగుతున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు మోకాలు భాగం వరకు దోమలు కుడతాయని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా ప్రజలందరూ డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుసరించాలని అన్నారు. ఆహార అలవాట్లను సరైన సమయంలో తీసుకోవాలి. మూడు నుండి ఐదు లీటర్ల నీటిని త్రాగాలి. ఇంట్లో నీటిని నిల్వ ఉంచకూడదు. ఇంటిని రోజు శుభ్రం చేసుకోవాలి. ఆకుకూరలు పౌష్టికాహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ లో ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్లయితే కొంతవరకు మనమే ఇంటి వద్ద ఉండి టాబ్లెట్లను వేసుకుని జ్వరాలను తగ్గించుకోవచ్చు.