విషజ్వరాలను అరికట్టాలి

– ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విషజ్వరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గుతో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఫ్లూ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర జ్వరాలతో ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారని వివరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్రయివేట్‌ ఆస్పత్రులు, డయాగస్టిక్‌ సెంటర్లకు వెళ్లడంతో డబ్బులు విపరీతంగా ఖర్చవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వైరల్‌ జ్వరాలతో ప్రజలు పెద్దఎత్తున మంచాన పడుతున్నారని తెలిపారు. సీజనల్‌గా వచ్చే ఈ జ్వరాల నుంచి ప్రజలు వాటి బారిన పడకుండా ముందుస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ఏఎన్‌ఎంలు గత 15 రోజులుగా సమ్మెలో ఉండడంతో పర్యవేక్షణ, వైద్యం అందడంలేదని పేర్కొన్నారు. దోమల బెడదను అరికట్టడానికి దోమల మందు చల్లడం, ఫాగింగ్‌లాంటి చర్యలు ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహిస్తున్నదని విమర్శించారు. పీహెచ్‌సీలలో టెస్టులు చేయించుకున్నప్పటికీ రిపోర్టులు రావడానికి మూడు, నాలుగు రోజుల సమయం పడుతోందని వివరించారు. ఈలోగా డెంగీలాంటి జ్వరాల బారిన పడడంతో రక్తంలోని ప్లేట్‌లేట్లు పడిపోయి ప్రమాదకర స్థితికి వెళ్తున్న సంఘటనలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చూస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అవసరమైతే కొన్ని ప్రాంతాలకు డాక్టర్ల బృందాన్ని పంపించి వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యంత్రాంగాన్ని సమయాత్తం చేసి, అవసరమైన చర్యలు చేపట్టాలనీ, సంచార వైద్యశాలల ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు.