నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరీంనగర్‌లో బండి సంజయ్ ఇంటి ముట్టడి సందర్భంగా విద్యార్థి నాయకులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తక్షణమే నీట్‌ను రద్దు చేసి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు స్పందించకుంటే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో పోలీసు దాడులు, నిజామాబాద్ జిల్లాలో లాఠీచార్జ్ చేయటం ద్వారా ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వల్ల దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.