– ఏపీయూడబ్ల్యూజే ఖండన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్లపై పోలీసుల దౌర్జన్యం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్థన్, విజయవాడ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, ఆర్.సూర్యకిరణ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏచూరి శివ, సీహెచ్.రమణారెడ్డిలు సోమవారం ఒక ప్రకటన లో విమర్శించారు. అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేసేందుకు మహిళలను అరెస్ట్ చేస్తున్న పోలీసుల తీరును చిత్రిస్తున్న ఫొటో గ్రాఫర్లతో పాటు విలేకర్లపై విజయవాడ డీసీపీ విశాల్ గున్ని నాయకత్వంలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు కేంద్ర మైన విజయవాడ నగరంలో నిత్యం అనేక సమస్యలపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటారనీ, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మీడియా బాధ్యత అని గుర్తు చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం వారి అధికార అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఫొటోగ్రాఫర్ల విధులను అడ్డుకోవడం, వారిని పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి భయపెట్టే చర్యల కు పాల్పడడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్ రామును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారనీ, మరో ఫొటోగ్రాఫర్ రమణపై పోలీస్ ఉన్నతాధికారి సమక్షం లో మీడియా అయితే ఏమిటంటూ చులకనగా మాట్లాడారని తెలిపారు. ుడియాపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను వారు డిమాండ్ చేశారు.