నిమజ్జనంపై పోలీసుల డేగ కన్ను

Police eagle eye on immersion– హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సర్వం సిద్ధం
– 31వేల సిబ్బందితో భద్రత
– గణేష్‌ ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. నిమజ్జన ప్రక్రియ తుది దశకు చేరుకోవడం, మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినోత్సవం నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గురువారం బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు వినాయకుని శోభాయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా నగరానికి చేరుకునే అవకాశముంది. ఈ క్రమంలో హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేవిధంగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 25,694 మంది పోలీసులతోపాటు 125 ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 6000 మంది పోలీసులు, అదనంగా మరో 1000 మంది సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గణేష్‌ విగ్రహాలను తీసుకెళ్లే రహదారులతోపాటు ఘాట్ల వద్ద అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ బృందాలను రంగంలోకి దించారు. ట్రాఫిక్‌, సివిల్‌, టాస్క్‌ఫోర్సు, ఎస్‌వోటీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ పోలీసులతోపాటు ప్రత్యేక బృందాలను బందోబస్తులో ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌, రవాణా శాఖతోపాటు ఇతర శాఖలతో పోలీస్‌ అధికారులు కో-ఆర్డినేషన్‌ సమావేశాలు నిర్వహించి దిశానిర్ధేశం చేశారు.
ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయా ప్రాంతాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, నయాపూల్‌, ఎంజే మార్కెట్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్‌ సీపీ పర్యటించగా.. ఉప్పల్‌, చర్లపల్లి, కాప్రా, రాంపల్లి తదితర ప్రాంతాల్లో రాచకొండ సీపీ పర్యటించారు. ఇద్దరు కమిషనర్లు అవసరమైన ఏర్పాట్లు, శోభాయాత్ర కొనసాగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను అందించారు. పాత నేరస్థులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఊరేగింపుగా వచ్చే నిర్వాహకులకు, నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవా లన్నారు. నిమజ్జన ప్రక్రియ ఆలస్యం కాకుండా అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. డ్రైవర్లను, మేకానిక్‌లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాత్రిపూట నిమజ్జన సమయంలో ప్రమాదాలకు ఆస్కారముందని, నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీలు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన ప్రక్రియలో పాల్గొనొద్దన్నారు.