నేరాల నియంత్రణకై ‘మీకోసం పోలీస్‌’

– నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు
– సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
– నవతెలంగాణతో సీఐ కిరణ్‌కుమార్‌ ముఖాముఖి
నవతెలంగాణ – చందుర్తి :
నేరాల అదుపుకోసం ‘మీకోసం పోలీస్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నకిలీ విత్తనాలు నియంత్రణకు ఫెల్టిలైజర్‌ దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పలు అంశాలను నవతెలంగాణతో ముచ్చటించారు.
నవతెలంగాణ : నకిలీ విత్తనాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సీఐ కిరణ్‌కుమార్‌ : సర్కిల్‌ పరిధిలో కొనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల పరిధిలో విత్తనాల దుకాణాలలో తనిఖీలు చేపడుతున్నాం. ఎరువుల షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు పెడతాం.
నవతెలంగాణ : యువత వ్యసనాలకు బానిసవుతున్నారు. గంజాయి గుప్పుమంటోంది. అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..
సీఐ : గతంలో ఇక్కడ ఎక్కువ మంది గంజాయి విక్రయిస్తున్న ఘటనలు ఉన్నాయి. కొందరిపై కేసులు నమోదు చేశాం. ఈ మధ్య కాలంలో లింగంపేట, కొనరావుపేట మండల పరిధిలో నాగారంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌ చేశాం. నిజామాబాద్‌ గ్రామంలో కూడా హోటల్‌ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశాం.
నవతెలంగాణ : నేరాల నియంత్రణపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
సీఐ : మూడు మండలాల్లో ‘మీకోసం పోలీస్‌’ అనే కార్యక్రమంతో బాల్య వివాహాలు, బాల కార్మికులతో పనులు, గల్ఫ్‌ నకిలీ ఏజెంట్ల మోసం, గొడవలతో హత్యలు చోటుచేసుకుండా తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్నాం.
నవతెలంగాణ : గతంలో ఇక్కడే ఎస్‌ఐగా పనిచేశారు. నాటికి నేటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి.
సీఐ : గతంలో ఇక్కడ నేరాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. సమస్యాత్మకంగా ఉన్నా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. దీనితోపాటు నిఘా కూడా పెంచడం, ప్రజల నుంచి కూడా పోలీసులకు మద్దతు పెరగడంతో నేరాలను అదుపుచేస్తున్నాం. అయితే సైబర్‌ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.