జనచైతన్య యాత్రపై పోలీసుల వీరంగం

– నిర్మల్‌లో అడ్డుకునే యత్నం
– వేదికపైకి వచ్చి మైక్‌ కట్‌ చేసిన డీఎస్పీ
– ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వంత పాడిన పోలీసులు : ఎస్‌.వీరయ్య
– దాడిపై తమ్మినేని ఖండన
నవతెలంగాణ విలేకరి- నిర్మల్‌
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్రపై పోలీసులు దాడి చేశారు. నిర్మల్‌ జిల్లాలో యాత్ర ప్రధాన ప్రచారకర్త.. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతుండగానే.. డీఎస్పీ జీవన్‌రెడ్డి వేదిక మీదకు దూసుకొచ్చారు. మైక్‌ కట్‌ చేయాలన్నారు. ఒక రాజకీయ పార్టీ వేదిక మీదకు దూసుకురావడమే కాకుండా.. వారించిన కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. మైక్‌ వైర్లు లాగేశారు. లైట్లు ఆపేశారు. కరెంటు వైర్లను తెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై కేసులు పెడతామని డీఎస్పీ బెదిరించారు. ”రాష్ట్ర డీజీపీ పర్మీషన్‌ ఇచ్చిన తరువాత మీరెలా మా సభను ఆపుతారు? మా వేదిక మీదకు మీరెలా వస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పోలీసులంతా పని చేస్తున్నారా? మేము బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? నిర్మల్‌ పోలీసులు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగుగా పని చేస్తున్నారా?’ అని ఎస్‌.వీరయ్య, యాత్ర ప్రతినిధి బృందం అడివయ్య, స్కైలాబ్‌, ఆశయ్య, జయలక్ష్మీ, జగదీష్‌, లెల్లెల బాలకృష్ణ నిర్మల్‌ డీఎస్పీని వేదిక మీదనే నిలదీశారు. దాంతో ఎలాంటి సమాధానమూ చెప్పకుండా వెళ్లిపోయిన డీఎస్పీ.. మళ్లీ సభ పున:ప్రారంభమవ్వగానే వేదిక వద్దకు దూసుకొచ్చి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించారు. సభికులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. ‘సాయంత్రం ఐదు గంటల తరువాత సభ జరుపుకోమని తమ పార్టీ స్థానిక జిల్లా కమిటీకి అనుమతినిచ్చారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఆఫీసు పక్కనే ఉన్నందున కార్యకలాపాలకు ఆటంకం జరుగుతుందని సాకు చూపెట్టి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు పోలీసుల రూపంలో సభ మీద దాడి చేస్తున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం ఐదు తరువాత ప్రభుత్వ ఆఫీసులేవీ ఉండవని చెప్పింది పోలీసులే. సమావేశం జరుగుతుండగా అడ్డుకునేదీ వారే. నిర్మల్‌ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఈ ఘటనను చూస్తే అర్థమైపోతుంది’ అని అన్నారు. కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన అంశాలు మాట్లాడుతుండ గానే.. వాటి గురించి ప్రజలను చైతన్యం చేసే నాలుగు మాటలు మాట్లాడు తుండగానే పోలీసులకు ఎక్కడాలేని కర్తవ్యం గుర్తుకురావడం ఇందుకు నిదర్శన మని అన్నారు. పోలీసులు మైక్‌ కట్‌ చేయడంతో, మైక్‌ లేకుండానే సభ కొన సాగింది. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మీ, అడివయ్య మాట్లాడుతూ.. ‘మైక్‌ లేకపోతే గొంతుంది. మా గొంతును మీరు నొక్కలేర’న్నారు. దాంతో ప్రజలందరూ ‘అవును పోలీసులూ మీరు మా గొంతు నొక్కలేరు’ అని నినాదాలిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సభకు సీపీఐ(ఎం) నిర్మల్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గ, నూతన కుమార్‌ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొమ్మెన సురేష్‌, జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి, ఎస్‌.అరవింద్‌, ఎస్‌.శంభు, గంగమణి, యాత్ర రూట్‌ ఇన్‌చార్జ్జి అనగంటి వెంకటేష్‌ పాల్గొన్నారు.
అడ్డుకోవడం దారుణం : తమ్మినేని
బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) చేపట్టిన యాత్రపై నిర్మల్‌లో పోలీసులు అడ్డుకోవడం దారుణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సభకు అన్ని అనుమతులు ఉన్న తరువాత.. నాయకులు మాట్లాడుతున్న సమయంలో మైక్‌ను కట్‌ చేయడం, వైర్లు లాగేయడం సరైన చర్య కాదన్నారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు.